పోటాపోటీ ప్రదర్శనలు

24 Dec, 2019 02:28 IST|Sakshi
సత్యాగ్రహం కార్యక్రమంలో తన తల్లి సోనియాకు శాలువా కప్పుతున్న రాహుల్‌

‘పౌర’ చట్టంపై అనుకూల, వ్యతిరేక ర్యాలీలు

ఢిల్లీలో కాంగ్రెస్‌ సత్యాగ్రహం

కోల్‌కతాలో బీజేపీ ర్యాలీ

న్యూఢిల్లీ/కోల్‌కతా/తిరువనంతపురం/ముంబై: పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించారు.  

పౌర చట్టంపై కాంగ్రెస్‌ సత్యాగ్రహం!
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహం చేపట్టింది. ‘ఐకమత్యం కోసం సత్యాగ్రహం’పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, ముఖ్య నేతలు పాల్గొన్నారు.  విద్వేషాలను పెంచుతూ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భరత మాత గొంతు అణచివేసేందుకు, రాజ్యాంగంపై దాడికి చేస్తున్న యత్నాలను ప్రజలు కొనసాగనివ్వబోరని హెచ్చరించారు.

చెన్నైలో డీఎంకే ర్యాలీ
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ పక్కన కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం ‘పౌర’చట్టానికి వ్యతికేకంగా ప్లకార్డులు పట్టుకుని నడిచారు.  

పెళ్లిళ్లు, వేడుకల్లోనూ ‘పౌర’ నిరసనలు
కేరళలో పెళ్లిళ్లు, వేడుకలు, క్రిస్మస్‌ సంబరాలే నిరసన వేదికలుగా మారాయి. ఈ ఒరవడి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వరుడు, వధువు పెళ్లి విందు సందర్భంగా ఎన్నార్సీకి, పౌర చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ముందు నడుస్తుండగా వారి బంధువులు నినాదాలు చేసుకుంటూ వస్తున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

రాజకీయ లబ్ధికే బెంగాల్‌ సీఎం మొగ్గు..
పౌరసత్వ సవరణ చట్టంపై సాధారణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా అన్నారు. ‘పౌర’చట్టానికి అనుకూలంగా కోల్‌కతాలో సోమవారం బీజేపీ చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

ఆశ్చర్యం కలిగించాయి: పవార్‌
దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)అమలు చేసే విషయమై పార్లమెంట్‌లో చర్చే జరగలేదన్న మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఎన్నార్సీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ పార్లమెంట్‌ సంయుక్త సమావేశం సందర్భంగా రాష్ట్రపతిæ వెల్లడించారని గుర్తు చేశారు.

మమతా బెనర్జీ లేఖ
బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కలిసికట్టుగా ఉండి దేశాన్ని రక్షించుకుందామన్న బెంగాల్‌ సీఎం మమత.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల సీనియర్‌ నేతలకు లేఖలు రాశారు.

అందుకే ఎన్నార్సీపై వెనక్కు!
జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నార్సీపై కేబినెట్లోగానీ, పార్లమెంట్లోగానీ చర్చించలేదని ఆదివారం ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ చెప్పడం తెల్సిందే. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలపై నిరసనలు, హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో కొన్నాళ్లు ఎన్‌ఆర్‌సీని పక్కనపెట్టాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే ప్రధాని ఆ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు. అందుకే ఎన్నార్సీ, సీఏఏ వేరువేరు అని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతాయని ఊహించలేదని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నార్సీపై ముస్లింల ఆందోళన కూడా ఈ స్థాయిలో నిరసనలు జరగడానికి కారణమని పేర్కొన్నారు.   
 

మరిన్ని వార్తలు