‘జనం సొమ్ముతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఊతం’

20 Mar, 2019 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులకు సూచిస్తూ ప్రజల సొమ్మును ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌కు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కేంద్రం కోరుతున్న సంగతి తెలిసిందే. దివాళా తీసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బెయిలవుట్ ప్రతిపాదనన పట్ల కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జీవాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎస్‌బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రూ 8500 కోట్ల రుణాన్ని వాటాలుగా మలుచుకోవాలని ప్రధాని సూచించడంతో సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఆయా బ్యాంకులకు 50 శాతం వాటా దక్కుతుందని సుర్జీవాలా పేర్కొన్నారు. దివాళా తీసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి కార్పొరేట్‌ సంస్థకు బెయిలవుట్‌ ప్యాకేజ్‌ ఇచ్చేందుకు మోదీ సర్కార్‌ ఎందుకు తొందరపడుతోందని ఆయన ప్రశ్నించారు.

రుణభారంతో సతమతమవుతున్న రైతులను విస్మరించి విదేశీ ఇన్వెస్టర్ల నియంత్రణలో ఉన్న ఈ కంపెనీని ప్రజల సొమ్ముతో ఆదుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ప్రజల ధనానికి రక్షకులు మాత్రమేనని, ఇలాంటి నిర్ణయాలు వాటంతటవే తీసుకోలేవని సుర్జీవాలా చెప్పారు.

మరిన్ని వార్తలు