మోదీకి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌

26 Jan, 2020 20:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో పంపిన 170 రూపాయల విలువగల వస్తువును మరేదో కాదు.. భారత రాజ్యాంగ పుస‍్తకం. ఈ రాజ్యాంగ ప్రతిని మోదికి పంపి.. దేశాన్ని విభజించే ముందు రాజ్యాంగాన్ని ఓ సారి చదువుకోండి అని ట్వీట్‌ చేసింది. 

గత కొంత కాలంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ, ఎన్‌పీఏ ఆందోళనలతో దేశం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీతో సహా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. మతం ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం కల్పించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని, ఈ కనీస పాఠాన్ని కూడా బీజేపీ నేర్చుకోలేకపోయిందని, కాబట్టే సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తోపాటు యావత్ దేశం ఆందోళనలను చేస్తున్నదని ఆ పార్టీ విమర్శించింది.

ఈ నేపథ్యంలో ప్రధానికి రాజ్యాంగ ప్రతిని గిఫ్ట్‌గా పంపింది. ‘గౌరవనీయులైన ప్రధాని గారు.. దేశాన్ని విభజించే పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు.. అయితే ఏకొంచెం టైమ్ దొరికినా ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.. ఇది మన భారత రాజ్యాంగం.. మన వ్యవస్థలన్నీ పనిచేసేది దీనిపైనే’  అంటూ ట్విట్‌ చేసింది.  ఫొటోలతోపాటు కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రాజ్యాంగ పీఠిక చదువుతోన్న వీడియోలను కూడా పార్టీ ట్విటర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. మరి ప్రధాని కార్యాలయం ఈ గిఫ్ట్‌ను స్వీకరించిందా? తిప్పి పంపిందా? అనేది తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు