ఒక్క అడుగు దూరంలో..

12 Dec, 2018 11:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు సానుకూలంగానే ఉన్నా ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌కు ఆ పార్టీ కొద్ది దూరంలో నిలిచింది. సొంతంగా ప్రభుత్వాల ఏర్పాటుకు అరకొర సీట్లు తగ్గడంతో ఆ పార్టీ బీఎస్పీ సహా స్వతంత్రుల సహకారం ఆశిస్తోంది. రాజస్దాన్‌లో సాధారణ మెజారిటీకి ఒక స్ధానం​ కాంగ్రెస్‌కు తగ్గగా, మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లు తక్కువగా వచ్చాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలతో పాటు స్వతంత్రులతో జట్టు కట్టక తప్పని పరిస్థితి నెలకొంది.

మధ్యప్రదేశ్‌లో మేజిక్‌ ఫిగర్‌కు కాంగ్రెస్‌ రెండు స్ధానాలు దూరంలో నిలవడంతో రెండు సీట్లు నెగ్గిన బీఎస్పీ, ఒక స్ధానంలో గెలుపొందిన ఎస్పీలతో కాంగ్రెస్‌ సంప్రదింపులు ప్రారంభించింది. ఇక్కడ బీజేపీ సైతం 109 స్ధానాలు దక్కించుకోవడంతో కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ వేగంగా పావులు కదుపుతోంది.

ఇక రాజస్ధాన్‌లో బీజేపీ కంటే కాంగ్రెస్‌ అత్యధిక స్ధానాలు గెలుపొందడం, మెజారిటీ మార్క్‌కు కేవలం ఒక స్ధానం మాత్రమే తగ్గడంతో కాంగ్రెస్‌ సేఫ్‌జోన్‌లో ఉంది. ఇక్కడ ఆరు సీట్లు నెగ్గిన బీఎస్పీ, రెండు సీట్లు కైవసం చేసుకున్న సీపీఐ(ఎం), ఇతర చిన్న పార్టీల మద్దతు కోరేందుకు కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు స్వతంత్రుల్లో కాంగ్రెస్‌ రెబెల్స్‌ ఎక్కువ మంది నెగ్గడంతో వారి సహకారం లభిస్తుందనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు