దేశాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రెస్ : నరేంద్ర మోడీ

1 Dec, 2013 04:05 IST|Sakshi
దేశాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రెస్ : నరేంద్ర మోడీ

 దీని పర్యవసానమే ఆంధ్ర, తెలంగాణలో పరిస్థితులు
     ధరల నియంత్రణలోనూ దారుణంగా విఫలం
     దేశాన్ని ఎలా నడపాలో పీవీని, వాజ్‌పేయిని
     చూసి నేర్చుకోవాలి
     ఢిల్లీ బహిరంగ సభల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ
 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని సమైక్యత, అభివృద్ధి తమ పార్టీ మంత్రమని, అధికారం కోసం దేశాన్ని ముక్కలు చేయడం కాంగ్రెస్ రాజనీతి అని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దీని పర్యవసానంగానే ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఎర్రకోట సమీపంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వాల కోసం బీజేపీ పాటు పడుతుంటే, కాంగ్రెస్ విభజించి పాలించే పద్ధతులను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ‘మా హయాంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను వేరు చేశాం... యూపీలోనూ, ఉత్తరాఖండ్‌లోనూ ప్రజలు మిఠాయిలు పంచుకున్నారు. మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్‌ను ఏర్పాటు చేశాం... రెండు ప్రాంతాల వారూ మిఠాయిలు పంచుకున్నారు.
 
 బీహార్ నుంచి జార్ఖండ్‌ను వేరు చేసినప్పుడు బీహార్‌లోనూ, జార్ఖండ్‌లోనూ మిఠాయిలు పంచుకున్నారు’ అని చెప్పారు. అయితే, కాంగ్రెస్ విభజన రాజకీయాల ఫలితంగా ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో కర్ఫ్యూ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. షహ్‌దారా, సుల్తాన్‌పురి, చాందినీ చౌక్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లోనూ మోడీ ప్రసంగించారు. నిత్యావసరాల ధరల నియంత్రణలోనూ కాంగ్రెస్ సర్కారు దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెసేతర ప్రభుత్వాల హయాంలో దేశంలో ధరలు అదుపులో ఉండేవని, యూపీఏ పాలనలో అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. పుస్తక పరిజ్ఞానం తప్ప వాస్తవిక జ్ఞానం లేని ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం దేశాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు. ‘మోడీ నుంచి మేం పాఠాలు నేర్చుకోనక్కర్లేదని వారంటే అనవచ్చు... కానీ వారు కనీసం పీవీ నరసింహారావు, వాజ్‌పేయిల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
 
 అప్పుడే దేశాన్ని ఎలా నడపాలో తెలుస్తుంది. వారిద్దరూ గొప్ప ఆర్థికవేత్తలు కాకపోయినా, దేశ సమస్యలు తెలిసిన గొప్ప నాయకులు’ అని అన్నారు. ప్రజలు రెండు పూటలా కూరలు తింటుండటం వల్లే ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు పేదలను అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. ప్రపంచంలోని తెలివితేటలన్నీ తనకు మాత్రమే ఉన్నాయని, మిగిలిన వారంతా మూర్ఖులని ఆయన అనుకుంటారని సిబల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాయగూరలు అమ్మడం ప్రభుత్వం పని కాదని కాంగ్రెస్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ‘ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉల్లిగడ్డలను అమ్మడం లేదా?’ అని ప్రశ్నించారు. ఒక చెయ్యి చూపించే కాంగ్రెస్ రెండు చేతులా దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇటీవల పుట్టుకొచ్చిన మరో పార్టీ ‘చీపురు’తో మొత్తాన్నే ఊడ్చేస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీని పరోక్షంగా విమర్శించారు. పులిని చూడటానికి పిల్లలు ‘జూ’కు వెళుతుంటారని, అలాగే షెహజాదా (రాహుల్) పేదరికాన్ని చూడటానికి ఏడాదికోసారి పేదల గుడిసెలకు వెళుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
 నేను మోడీ అంత చదువుకోలేదు: చిదంబరం
 బంగారం కొనడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని తానెన్నడూ అనలేదని ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. బంగారం అత్యధికంగా కొనడం వల్ల కరెంటు ఖాతా లోటు పెరుగుతోందని చెప్పానే తప్ప ద్రవ్యోల్బణం పెరుగుతుందని అనలేదన్నారు. ‘నేను మోడీ అంత చదువుకోలేదు. బంగారం కొంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందని నాకు తెలియదు’ అని ఎద్దేవా చేశారు. కాగా, జోధ్‌పూర్‌లో ఇటీవల జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ, బంగారం కొనడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని చిదంబరం అన్నట్లుగా ఆరోపించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు