‘ఆమె వ్యాఖ్యలు దేశానికి అవమానకరం’

16 May, 2019 17:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా భోపాల్‌ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ కొనియాడటం పట్ల కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతంపై దాడి అని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా ఆక్షేపించారు. భారత ఆత్మను నాథూరాం గాడ్సే వారసులు, పాలక బీజేపీ శ్రేణులు దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు.

మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేను నిజమైన జాతీయవాదిగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారని..ఇది దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతానికి తూట్లుపొడవడమేనని సుర్జీవాలా పేర్కొన్నారు. సాధ్వి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గాంధీని చంపిన గాడ్సే ఓ హంతకుడని, ఆయనను కీర్తించడం దేశభక్తి కాదని, రాజద్రోహమని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. బీజేపీ వివరణ.. ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని, దీనిపై పార్టీ ఆమె వివరణ కోరుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. కాగా మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ఉంటారని సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు