ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

2 Feb, 2020 15:30 IST|Sakshi

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్‌లు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 20 వేల లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇవ్వగా... దానికి ప్రతిగా కాంగ్రెస్ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మాటిచ్చింది.

ఆటోలు, ఈ-రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం ఇస్తోన్న బియ్యం, గోధుమలను రెట్టింపు చేస్తామని తెలిపింది.ఇందులో నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌కు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు రూ.5,000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున ప్రతి నెలా నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఈ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది. 'అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న రూపంలో ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను అమలు చేసేది లేదు' అని పేర్కొంది.

సుప్రీంకోర్టులో సీఏఏను సవాలు చేస్తామని తెలిపింది. గతంలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు.
 

మరిన్ని వార్తలు