రాహుల్ను జోకర్ అన్న నాయకుడి సస్పెన్షన్

30 May, 2014 10:38 IST|Sakshi
రాహుల్ను జోకర్ అన్న నాయకుడి సస్పెన్షన్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని జోకర్ అంటూ విమర్శించిన కేరళ మాజీ మంత్రి టీహెచ్ ముస్తఫాను ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీని ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి, ఆ పగ్గాలను ఆయన సోదరి ప్రియాంకా వాద్రాకు అప్పగించాలని ముస్తఫా ఇంతకుముందు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ సభ్యుడు కూడా అయిన ముస్తఫా వ్యాఖ్యలను పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ఖండించారు. మీడియా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.

లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలు కావడంతో రాహల్ గాంధీ మీద ముస్తఫా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన పార్టీ నుంచి రాజీనామా చేయాలని, ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన పిచ్చి విధానాలు, జోకర్ లాంటి ప్రవర్తన, కాంగ్రెసేతర సలహాదారులతో ఆయన అనుబంధం.. ఇవే పార్టీ ఓటమికి ప్రధాన కారణాలని అన్నారు.

మరిన్ని వార్తలు