ఎవరినో కాపాడాలని చూశారు

4 Mar, 2015 00:36 IST|Sakshi

 అందుకే యూపీఏ హయాంలో నల్లధనంపై సిట్ వేయలేదు: మోదీ ధ్వజం
  2011లోనే సిట్ వేసి ఉంటే ఈసరికే నల్లధనం వెనక్కు వచ్చేది
  బెదిరించే స్వభావం నాకు లేదు... అది ఎవరికి ఉందో అందరికీ తెలుసు
  స్వచ్ఛ భారత్, అందరికీ గృహాలు, జనధన్ పేదలకా? ధనికులకా?
  ఆహార భద్రతను, రైతుల పరిహారాన్ని తగ్గించటం లేదు
  భూసేకరణ బిల్లులో రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన అంశాలేవైనా ఉంటే.. వాటిని సరిచేయటానికి మేం సిద్ధం
  ‘రాష్ట్రపతి ప్రసంగం’పై చర్చకు రాజ్యసభలో ప్రధాని జవాబు


 న్యూఢిల్లీ: యూపీఏ సర్కారు హయాంలో నల్లధనం విషయంలో ఎవరినో కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని.. అందుకే 2011లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ నల్లధనంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌ను) ఏర్పాటు చేయలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత యూపీఏ సర్కారుపై, దానికి సారథ్యం వహించిన కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. తన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు, ధనికవర్గాలకు అనుకూలంగా పనిచేస్తోందన్న విమర్శలను తిప్పికొడుతూ.. ‘స్వచ్ఛ భారత్ మిషన్, అందరికీ గృహనిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, జనధన్ వంటి పథకాలు.. ధనవంతులకు ప్రయోజనం కలిగించేందుకా? పేదలకు ప్రయోజనం కలిగించేందుకా?’ అని ప్రశ్నించారు. ఆహార భద్రతను తగ్గిస్తున్నామని, భూసేకరణలో రైతుల పరిహారాన్ని తగ్గిస్తున్నామని తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. అటువంటి ప్రయత్నాలేవీ లేవని మోదీ స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మంగళవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా గంట సేపు ప్రసంగించారు.


 ‘నల్లధనం అంశంపై నా ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా ఏం చేసిందన్న ప్రశ్నలు అడుగుతున్నారు. సుప్రీంకోర్టు 2011లో సిట్‌ను ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడే దానిని ఏర్పాటు చేసివుంటే.. నల్లధనాన్ని వెనక్కు తీసుకురావాలన్న స్వప్నం ఇప్పటికి సాకారమై ఉండేదని భావిస్తున్నాను. ఆ సమయంలో సిట్‌ను ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఎవరినో కాపాడటానికి అప్పుడు ప్రయత్నం జరిగింది’ అని పేర్కొన్నారు. నల్లధన ఖాతాలున్న వారి పేర్లను బహిర్గతం చేస్తామన్న పేరుతో విపక్షాన్ని ప్రభుత్వం బెదిరిస్తోందన్న ఆనంద్‌శర్మ(కాంగ్రెస్) చేసిన ఆరోపణలను మోదీ తిరస్కరించారు. ‘ఇతరులను బెదిరించే ఆలోచనా విధానం నాకు లేదు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో ఎన్నడూ పనిచేయలేదు, ఎన్నడూ పనిచేయదు. చట్టం తన పనిని తాను చేసుకోనివ్వాలి’ అని పేర్కొన్నారు. ‘గుజరాత్‌లో నాకు 14 ఏళ్ల పాటు.. నన్ను జైలుకు పంపిస్తామనే బెదిరింపులు, లేఖలు రోజూ అందేవి. అప్పుడు ఎటువంటి ఎత్తుగడలు వేస్తున్నారో నాకు తెలుసు. దీనిపై ఇంకా ఎక్కువ చెప్పదలచుకోలేదు. చరిత్ర లిఖితమైనప్పుడు ఒక నాడు ఇది వెలుగులోకి వస్తుంది’ అని అన్నారు. ‘బెదిరించే స్వభావం, భాష ఎవరికి ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎమర్జెన్సీ కాలంలో ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు. అంతకుమించిన పెద్ద బెదిరింపు ఏముంటుంది?’ అంటూ కాంగ్రెస్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు.  ‘నా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనదని, ధనవంతులకు అనుకూలమైనదని ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. స్వచ్ఛతా అభియాన్ కార్పొరేట్ల కోసమా? పేదల వాడల్లోని ప్రజలు నాణ్యమైన జీవితం కోసం వేడుకొంటున్నారు. నేను స్వచ్ఛత గురించి మాట్లాడుతున్నప్పుడు వారి గురించి మాట్లాడుతున్నాను. జనధనయోజన కార్పొరేట్ల కోసం ఉద్దేశించినదా? ఇది ధనవంతుల కోసం కాదు.. కార్పొరేట్ల కోసమూ కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల గురించి నేను మాట్లాడినపుడు.. దానితో ధనికులకు, కార్పొరేట్లకు సంబంధమేముంటుంది? ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేది పేద ప్రజల పిల్లలే. భూసార ఆరోగ్య కార్డుల గురించి నేను చెప్పినప్పుడు.. అది ధనికులు, కార్పొరేట్ల కోసం పనిచేయటమా? ఈ డబ్బు వారి ఖాతాల్లోకి వెళుతుందా? అందరికీ గృహనిర్మాణం పథకమనేది.. ధనికులకు ఉద్దేశించిందా? పేదలకు ఉద్దేశించిందా?’’ అంటూ మోదీ ప్రశ్నల వర్షం కురిపించారు.


 తొలి ఎన్‌డీఏ సర్కారు అమలు చేసినవే...
 దేశ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలన్నీ కృషి చేశాయని అంగీకరించే ధైర్యం తనకు ఉందని.. గతంలోనూ ఈ పనిచేశానని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 350కి పైగా ప్రతిపాదనలు వివిధ విభాగాల మధ్య వివాదాలతో నిలిచిపోయాయని చెప్పారు.  యూపీఏ సర్కారు పథకాలనే మోదీ సర్కారు కొత్తగా పేర్లతో తీసుకొస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను ప్రధాని ఎద్దేవా చేస్తూ.. తొలి ఎన్‌డీఏ సర్కారులో అమలు చేసిన పథకాలనే యూపీఏ కాపీ కొట్టిందని ఎదురుదాడి చేశారు. యూపీఏ సర్కారు ప్రారంభించిన వివిధ పథకాలు అప్పటికే ఏదో ఒక పేరుతో అమలులో ఉన్నాయన్నారు. వాజపేయి అమలు చేసిన సర్వశిక్షా అభియాన్‌ను యూపీఏ సర్కారు విద్యా హక్కు చట్టంగా తెచ్చిందన్నారు. మల్టీ పర్సస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు పథకాన్ని ఆధార్‌గా తెచ్చారని పేర్కొన్నారు. అంత్యోదయ అన్నయోజన స్థానంలో కాంగ్రెస్ ఆహార భద్రత చట్టం తెచ్చిందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అప్పటికే  సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన పేరుతో అమలులో ఉందన్నారు. దీనితో కాంగ్రెస్  నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బడుగు వర్గాల సంక్షేమ చర్యల గురించి మోదీ మాట్లాడుతున్నపుడు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ.. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రైవేటు రంగానికి కూడా విస్తరిస్తుందా? అని ప్రశ్నించారు.


 ఆహార భద్రత, భూసేకరణలపై తప్పుడు ప్రచారం వద్దు...
 ‘‘ఆహార భద్రత చట్టంపై తప్పుడు సమాచార ప్రచారం జరుగుతోంది. జనాభాలో 67 శాతం మందికి దీనిని వర్తింపచేయటాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీనిని 40 శాతానికి తగ్గించటం లేదు. అపోహలను ప్రచారం చేయవద్దు. భూసేకరణ చట్టానికి సవరణల విషయంలోనూ.. రైతులకు చెల్లించే పరిహారాన్ని తగ్గిస్తున్నట్లు వదంతులను ప్రచారం చేస్తున్నారు. దయచేసి మనం అటువంటి వదంతులను ప్రచారం చేయొద్దు. దాని జోలికి ఎవరూ వెళ్లలేదు.  వెళ్లరు. ఏం నిర్ణయించారో.. దానిని అలాగే ఉంచాం. ప్రస్తుతమున్న చట్టంలో నిర్దిష్ట బలహీనతలు ఉన్నాయి.   ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూమి అందుబాటులో ఉండేలా చూడటానికి వీటిని పరిష్కరించాల్సిన అవసరముంది. ఒకవేళ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే అంశాలేవైనా(బిల్లులో) ఉంటే.. మొదటి రోజే చెప్పాను.. వాటిని సరిచేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని ప్రధాని ఉద్ఘాటించారు. రాష్ట్రాలకు ఎన్నో సహజ వనరులు ఉన్నా కూడా పేద రాష్ట్రాలుగానే ఉండిపోయాయని.. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే దేశం ముందుకు వెళ్లలేదని ప్రధాని పేర్కొన్నారు. బొగ్గు గనులను వేలం వేయాలన్న నిర్ణయం సంపన్న వనరులున్న రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు.


 నన్ను చూశాక అభిప్రాయం మారి ఉండాలి
 బీజేపీని హిందీ ప్రాంత పార్టీగా పిలిచిన రోజులు ఉన్నాయని.. కానీ ఇప్పుడు తమ పార్టీ లోక్‌సభలో ఉత్తరాన లడఖ్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకూ.. పశ్చిమాన కచ్ నుంచి తూర్పున అరుణాచల్‌ప్రదేశ్ వరకూ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తోందని మోదీ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ తాము ప్రభుత్వాలను నడిపామన్నారు. బీజేపీని అగ్రవర్ణాల పార్టీగా పిలిచే వారు.. తనను చూసిన తర్వాత అభిప్రాయాలను మార్చుకుని ఉండాలంటూ.. తాను ఓబీసీనని పరోక్షంగా ప్రస్తావించారు. క్రైస్తవులు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్న గోవాలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించిందన్నారు. ముస్లింలు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.

మరిన్ని వార్తలు