దుమారం దిశగా.. మాజీ మంత్రి వ్యాఖ్యలు

30 Dec, 2019 13:11 IST|Sakshi
నిరసనలో నవరంగపూర్‌ మహిళా కాంగ్రెస్‌ నాయకులు

కొశాగుమడ మైనరుపై జరిగిన లైంగికదాడి, హత్య ఘటనలపై సంజయ్‌దాస్‌ అనుచిత వ్యాఖ్యలు

నిరసన వ్యక్తం చేసిన నవరంగపూర్‌ మహిళా కాంగ్రెస్‌

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

ఒడిశా, జయపురం: నవరంగపూర్‌ జిల్లాలోని కొశాగుమడలో కొద్దిరోజుల క్రితం ఓ మైనరు బాలికపై జరిగిన లైంగికదాడి, హత్య ఘటనలు అవాస్తమని మాజీ మంత్రి సంజయ్‌దాస్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేడీలో సీనియర్‌ నేతగా ఉన్న ఆయన మహిళలను అగౌరవ పరచడమేంటనియావత్తు మహిళా లోకం ప్రశ్నిస్తోంది. సుధీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందిన ఆయన మహిళల సంక్షేమం పట్ల చొరవ చూపించాల్సింది పోయి జరిగిన దుర్ఘటన పట్ల కనీసం సానుభూతి చూపించకపోవడం చాలా విడ్డూరంగా ఉందని నవరంగపూర్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నవరంగపూర్‌ జిల్లా కాంగ్రెస్‌ భవన్‌ ముందు అనేక మంది కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షురాలు పి.నాగరత్నమ్మ మాట్లాడుతూ బాలికపై పలువురు దుండగులు జరిపిన లైంగికదాడి, హత్య ఘటనలపై మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుండగులను సమర్థించేవిగా ఉన్నాయని ఆరోపించారు. ఇది చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆయన తన మాటలను వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వచ్చే ఏ ఎన్నికల్లో తన విజయం కోసం మహిళలు పాటుపడరని హెచ్చరించారు. నిరసనలో మహిళా కాంగ్రెస్‌ నేతలు ప్రభాతి త్రిపాఠి, ప్రణతి త్రిపాఠి, బాసంతి మంజరీ నాగ్, ప్రేమ సుందరీ నాగ్, దినమణి గొరడ, సుబేంద్ర బాగ్, మాధవి సున, అంజలీ బాగ్, కమల నాగ్, సుభద్ర బాగ్, హురు బానో, అయిసా భాను, హుసున భాను, పద్మినీ శాంత, ప్రమీల సామంతరాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు