నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు : సదాఫ్‌ జాఫర్‌

22 Dec, 2019 18:45 IST|Sakshi

లక్నో : లక్నోలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నసమయంలో అక్కడే ఉన్న యుపీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్‌ను పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె అరెస్టుకు ముందు అక్కడ ఘర్ణణకు సంబంధించిన వీడియోలనూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.  

వివరాల్లోకి వెళితే.. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ డిసెంబర్ 19 న లక్నోలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌ బయట పార్క్‌ చేసి ఉన్న వాహనాలపై దాదాపు 200 మంది ఆందోళనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి తమ నిరసనను తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్‌ కూడా ఉన్నారు.

నిరసనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న సదాఫ్‌ జాఫర్‌తో పాటు మరో 34మందిపై లక్నోలోని హజ్రత్‌ఘంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఆమె అరెస్టుకు ముందు తీసిన వీడియోలో సదాఫ్‌ జాఫర్‌ మాట్లాడుతూ..  అల్లరి ముకలు రాళ్లతో దాడి చేస్తున్నా వాళ్లను ఆపడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని, వారిని పట్టుకోవాల్సింది పోయి అలాగే చూస్తు నిలబడడమేంటని ప్రశ్నించారు. మీకు రక్షణగా ఇచ్చిన హెల్మెట్‌ల వల్ల ఉపయోగం ఉపయోగం ఏంటని విమర్శించారు.దీంతో పాటు ఇంకో వీడియోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. సదాఫ్‌ జాఫర్‌ ఆందోళన జరుగుతున్న ప్రదేశంలో ఉండగా ఆమెను అరెస్టు చేయడానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ను ఉద్దేశించి .. రాళ్లతో దాడి చేస్తున్న వారిని వదిలేసి నన్నెందుకు అరెస్టు చేస్తున్నారు. ఇది అన్యాయమని అడిగారు.

ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో స్పందిస్తూ 'మా కార్యకర్త సదాఫ్ జాఫర్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. యూపీ పోలీసులు అసలు దోషులను వదిలేసి  సదాఫ్‌ జాఫర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారని, ఆమెను తీవ్రంగా కొట్టారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఒక మహిళపై అణచివేత ధోరణి తగదని, వెంటనే ఆమెను రిలీజ్‌ చేయాలని' డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు