కరోనాకు 5జీ టెక్నాలజీతో లింకేమిటి?

17 Jun, 2020 19:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభ సమయాల్లో నకిలీ వార్తలు వైరస్‌ కన్నా వేగంగా విస్తరిస్తాయి. వాటికి శాస్త్రవిజ్ఞాన సమాధానాలు కనుగొని ప్రజలకు వివరించడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకల్లా ప్రజలకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ‘5జీ టెక్నాలజీ’ వల్లనే కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని, అసలు కరోనాను తీసుకొచ్చిందే 5 జీ టెక్నాలజీ అంటూ సోషల్‌ మీడియా పదే పదే కోడై కూస్తోంది.

ఇలా నకిలీ వార్తలు, కుట్ర థియరీలు పుట్టుకు రావడం మనకు కొత్త కాదు. 1990 దశకంలో కూడా వీటి మూలాలను మనం చూడవచ్చు. 1903లో డాక్టర్లు ‘రేడియోఫోబియా’ గురించి మాట్లాడారు. అంటే ఎక్స్‌రేల వల్ల, హై ఫ్రీక్వెన్సీ కరెంట్‌ వల్ల మానవులకు ముప్పంటూ చెప్పారు. 1970 దశకంలో విద్యుత్‌ లైన్లు, మైక్రోవేవ్స్‌ ప్రమాదకరమని ప్రచారం కాగా, 1990లో 2జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. మొబైల్‌ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్‌ వల్ల క్యాన్సర్‌ వస్తోందని, టెలిఫోన్‌ టవర్ల వల్ల పక్షులు చనిపోతాయని, అందువల్లనే ముఖ్యంగా పిచ్చికలు నశించి పోతున్నాయని ప్రచారం జరిగింది.

ఒకనాడు చెట్లు నశించడానికి, పక్షి జాతులు నశించి పోవడానికి అసలు కారణాలు తెలియక, ఆ పరిణామాలను శాస్త్ర, సాంకేతికాభివృద్ధికి ముడిపెట్టి ప్రచారం చేయడం సంప్రదాయవాదులకు ఆనవాయితీ. వ్యాపార రంగంలో పాత టెక్నాలజీతో వ్యాపారం చేస్తున్న వారు కొత్త టెక్నాలజీ పోటీ పడలేమనుకొని ఆ టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వారు లేకపోలేదు. 5జీ టెక్నాలజీని తొలిసారిగా పరీక్షించి చూసిన చైనాలోని వుహాన్‌ పట్టణానికి, అక్కడే కరోనా పుట్టడానికి సంబంధం ఉందని ప్రచారం చేయడంలో వాస్తవం లేదు.

2019, ఏప్రిల్‌ మూడవ తేదీన 5జీ టెక్నాలజీని దక్షిణ కొరియాలోని సియోల్‌ నగరంలో ఎస్‌కే టెలికామ్‌ ఆవిష్కరించగా, అంతకుముందే 2018, డిసెంబర్‌ నెలలోనే తాము కనుగొన్నట్లు అమెరికా టెలికామ్‌ కంపెనీలు ప్రకటించాయి. చాలా దేశాల్లో కరోనా వైరస్‌ పుట్టకముందే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. (ఇంతకీ ఏమిటి ఈ డెక్సామెథాసోన్‌?)

ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్శిటీలో ‘న్యూమీడియా డిజిటల్‌ కల్చర్‌’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న మార్క్‌ టూటర్స్, యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో అమెరికన్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న పీటర్‌ నైట్, న్యూకాజల్‌ యూనివర్శిటీలో డిజిటల్‌ బిజినెస్‌లో లెక్చరర్‌గా పనిచేస్తోన్న వాసిమ్‌ అహ్మద్‌ సహా పలువురు నిపుణులు కరోనాకు 5జీ టెక్నాలజీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. (పుతిన్‌ రక్షణకు ‌ భారీ టన్నెల్‌ ఏర్పాటు)

Poll
Loading...
మరిన్ని వార్తలు