సమ్మతితో శృంగారంలో పాల్గొంటే.. చర్యలొద్దు!

15 Feb, 2016 11:37 IST|Sakshi
సమ్మతితో శృంగారంలో పాల్గొంటే.. చర్యలొద్దు!

న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్లు సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పుడు పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు నియమించిన ఓ ప్యానెల్ సూచించింది. వేశ్యల హక్కుల పరిరక్షణకు, వారికి మెరుగైన పనితీరు వాతావరణం కల్పించడానికి 2011లో ఏర్పాటైన ఈ ప్యానెల్‌ వచ్చే నెలలో తన నివేదిక సమర్పించనుంది.

వేశ్యవృత్తి ఒకరకంగా చట్టబద్ధమే అయినా కొన్ని చట్టాల వల్ల రెడ్‌లైట్ జిల్లాల్లో సెక్స్ వర్కర్లు పోలీసుల చర్యలకు బలవుతున్నారని ప్యానెల్ అభిప్రాయపడింది. 'స్వచ్ఛంద సెక్స్ వర్క్‌ అక్రమం కాదు కానీ, బ్రోతల్ హౌస్‌ నిర్వహించడం చట్టవ్యతిరేకం. ఈ నేపథ్యంలో బ్రోతల్ హౌస్‌లపై పోలీసులు దాడి చేసినప్పుడు సెక్స్ వర్కర్లను అరెస్టు చేయడంగానీ, జరిమానా విధించడంగానీ, వేధించడంగానీ చేయరాదు' అని ప్యానెల్ పేర్కొంది. అక్రమ మానవ రవాణా చట్టం (ఐటీపీఏ) 1956లోని సెక్షన్ 8లోని లైంగికంగా లోబర్చుకోవడం అనే పదాల్ని తొలగించాలని, దీనిని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా దుర్వినియోగపరుస్తున్నాయని ప్యానెల్ అభిప్రాయపడింది.

ఈ సెక్షన్ ప్రకారం వ్యభిచారం కోసం ప్రలోభపెడితే ప్రస్తుతం ఆరు నెలల జైలుశిక్ష, రూ. 500 జరిమానా విధిస్తున్నారు. అక్రమ మానవ రవాణాను అరికట్టే విషయంలో పోలీసులు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారు. ఉమ్మడి సమ్మతితో వ్యభిచారంలో పాల్గొన్నా.. సెక్స్ వర్కర్లపై, విటులపై చర్యలు తీసుకుంటున్నారని సీనియర్ న్యాయవాది ప్రదీప్ ఘోష్ నేతృత్వంలోని ప్యానెల్ అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు