‘అద్వానీపై కుట్రేనేమో’ కతియార్‌ సంచలనం

20 Apr, 2017 17:58 IST|Sakshi
‘అద్వానీపై కుట్రేనేమో’ కతియార్‌ సంచలనం

న్యూఢిల్లీ: బీజేపీ నేత వినయ్‌ కతియార్‌ సంచలన వ్యాఖ్య చేశారు. బాబ్రీ కేసు విషయంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై నిజంగానే కుట్ర జరిగి ఉండొచ్చని అన్నారు. ఆయనను రాష్ట్రపతి రేసులో నుంచి తప్పించేందుకు ఇప్పుడు ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా అంగీకరించారు. రాష్ట్రపతి రేసులో లేకుండా చేసేందుకు అద్వానీపై ప్రధాని నరేంద్రమోదీ కుట్ర చేశారని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కతియార్‌ను మీడియా ప్రశ్నించగా ‘ఏమో అతడు(లాలూ ప్రసాద్‌ యాదవ్‌) చెప్పినదాంట్లో నిజం ఉండొచ్చేమో. నాకు తెలియదు’ అని అన్నారు.

బజరంగ్‌దళ్‌ వ్యవస్థాపకుల్లో కతియార్‌ ఒకరిగా ఉండటమే కాకుండా మంచి సీనియర్‌ నాయకుడు. ఈయనపై కూడా బాబ్రీ కేసుకు సంబంధించి ఆరోపణలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్‌ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానీతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్‌ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు