గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్లపై వివాదం

14 Apr, 2017 17:07 IST|Sakshi
గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్లపై వివాదం

న్యూఢిల్లీ: భారత జాతీయ జెండాలోని మూడు రంగులకు కొత్త అర్థాన్ని, కొత్త భాష్యాన్ని చెబుతూ భారత క్రికెట్‌ స్టార్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు వివాదం రగులుతోంది. ఏ ఉద్దేశాలతోని జాతీయ జెండాలోకి మూడు వర్ణాలను ఎంపిక చేశారో, అందుకు పూర్తి విరుద్ధంగా కొత్త భాష్యం చెప్పడమంటే మన జాతీయ జెండానే అవమానించడేమేనని కొందరు విమర్శిస్తుండగా, అందుకు ఆయనపై కేసు పెట్టాలని మరికొందరు అదే సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేస్తున్నారు.

'భారత జాతీయ జెండాలోని కాషాయం రంగు మా కోపానికి నిదర్శనమని, తెల్లరంగు జిహాదీల శవాలపై తెల్లగుట్ట కప్పడమని, ఆకుపచ్చ రంగు విద్వేషమన్న అర్థాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని భారత వ్యతిరేకులు మరచిపోయినట్టున్నారు' అని గంభీర్‌ గురువారం ట్వీట్‌ చేశారు.

జాతీయ జెండాలోని కాషాయ రంగు భారత దేశ పటిష్టతకి, ధైర్యానికి చిహ్నమని, మధ్యనుండే తెల్లరంగు, అందులోని అశోక చక్రం శాంతికి, నిజానికి చిహ్నమని, ఇక ఆకుపచ్చ రంగు పరిపుష్టతకు, వృద్ధికి చిహ్నమని జెండా రూపకర్తలు సంక్షిప్తంగా సూచించారు. భారత తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ జెండాలోని రంగుల విశిష్టత గురించి కాస్త విఫులంగా చెప్పారు. కాషాయ రంగు ధైర్య సాహసాలకే కాదు, పరిత్యాగాన్ని సూచిస్తుందని, రాజకీయ నాయకులంతా తమ విధులకు అంకితం కావాలన్న స్ఫూర్తి ఇందులో ఉందన్నారు. అలాగే తెల్ల రంగు గురించి చెబుతూ అది ఒక వెలుతురు లాంటిదని, నాయకుల రుజువర్తనకు ఈ వెలుగు దారిచూపాలని చెప్పారు. ఆకుపచ్చ రంగు భూమితో మనకున్న అనుబంధాన్ని, భూమిపైనున్న చెట్లు, ఇతర ప్రాణుల పట్ల మనకుండాల్సిన ప్రేమను సూచిస్తుందని, అశోకచక్రం ధర్మాన్ని సూచిస్తోందని చెప్పారు. క్రికెట్‌తోపాటు గౌతమ్‌ గంభీర్‌ తీరిక వేలళ్లో సర్వేపల్లి రాధాకృష్ణ పుస్తకాలు చదవడం మంచిదని కూడా కొందరు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు