న్యాయవ్యవస్థ కళ్లు తెరవాల్సిందే!

16 Jan, 2019 16:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లోని ఉన్నత న్యాయవ్యవస్థకు సంబంధించి జనవరి పదవ తేదీన రెండు వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి సంజయ్‌ ఖన్నాను సుప్రీం కోర్టుకు నియమించడాన్ని విమర్శిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జీ కైలాష్‌ గంభీర్‌ రాష్ట్రపతికి లేఖ రాయడం. రెండూ డిసెంబర్‌ 12వ తేదీన సుప్రీంకోర్టుకు ఇద్దరు జడ్జీలను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసుకోవడం. 32 మంది జడ్జీల సీనియారిటీని కాదని సంజయ్‌ ఖన్నాను సుప్రీం కోర్టు జడ్జీగా నియమించారని గంభీర్‌ ఆరోపించారు. మరి ఈనేపథ్యంలోనే ఇద్దరు జడ్జీల నియామకాన్ని సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసుకుందో మాత్రం వెల్లడించలేదు.

జడ్జీలే జడ్జీలను నియమించే వ్యవస్థ ఒక్క భారత దేశంలో తప్పా ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలో లేదు. ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సుప్రీం కోర్టు సీనియర్‌ జడ్జీలతో కూడిన కొలీజియం హైకోర్టులు, సుప్రీం కోర్టుకు జడ్జీలను నియమిస్తుంది. ఈ పద్ధతి 1993 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు కేంద్ర ప్రభుత్వమే నియామకాలు జరిపేది. ఆ పద్ధతి వల్లన కేంద్రంలో అధికారంలో ఉండే రాజకీయ పార్టీ ప్రభావం నియామకాలపై ఉంటుందన్న ఉద్దేశంతో సుప్రీం కోర్టు ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థను మార్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో ప్రయత్నించి విఫలమయింది. సుప్రీం కోర్టు కొలీజియం నియామకాల్లో కూడా కేంద్రం ప్రభావం అప్పుడప్పుడు కనిపించడం, నియామకాలు వివాదాస్పదం అవడం తెల్సిందే. ఇప్పుడు సంజయ్‌ ఖన్నా నియామకం వివాదాస్పదం కాగా, అంతకుముందు సుప్రీం కోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేసుకుందో, అందులో ఏమి అవతవకలు జరిగాయో అంతు చిక్కడంలేదు.

ఉన్నత న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత లోపించిన కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్టీఐ (సమాచార హక్కు) చట్టం నుంచి సుప్రీం కోర్టు తనను తాను మినహాయించుకోవడం అంటేనే అది పారదర్శకతకు ఎంత విలువ ఇస్తుందో అర్థం అవుతోంది. సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి అలోక్‌ వర్మను తొలగింపునకు ఓటేసినందుకు ప్రత్యుపకారంగా జస్టిస్‌ సిక్రీని లండన్‌లోని ‘కామన్‌వెల్త్‌ సెక్రటేరియట్‌ ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌’ నియామకానికి కేంద్రం సిఫార్సు చేసిందని జాతీయ మీడియాలో విమర్శలు రావడంతో సిక్రీ ఆ పదవిని తిరస్కరించడం కూడా ఇక్కడ గమనార్హం. ఇప్పటికైనా న్యాయవ్యవస్థ కళ్లు తెరచి తనను సరిదిద్దుకోవాలి. పారదర్శకతకు పెద్ద పీట వేయాలి. లేకపోతే న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలకు విశ్వాసం పోయే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు