దుర్గాశక్తి సస్పెన్షన్‌పై యూపీలో వివాదం

30 Jul, 2013 04:54 IST|Sakshi

లక్నో/చిత్రదుర్గ: ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న మహిళా ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ని సస్పెండ్ చేయడంపై ఉత్తరప్రదేశ్‌లోని సాటి ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేగింది. ఆమె సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వారంతా అఖిలేశ్ యాదవ్ సర్కారుపై ఒత్తిడి పెంచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుసుకుని ఈ మేరకు డిమాండ్ చేశారు.

ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న యూపీ సీఎం అఖిలేశ్‌ను సోమవారం మీడియా ఈ అంశంపై ప్రశ్నించగా, తాను లక్నో చేరుకోగానే ఈ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. కాగా, 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ యూపీలోని గౌతమబుద్ధనగర్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఇసుక మాఫియాపై చర్యల్లో భాగంగా ఒక మసీదు గోడ కూలగొట్టాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఈ ఆదేశాలు జారీ చేసినందుకు ప్రభుత్వం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారుల సంఘం దుర్గాశక్తి నాగపాల్‌కు బాసటగా నిలి చింది. ఐఏఎస్‌ల సంఘం ప్రతినిధులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తిరిగి ఇక్కడకు చేరుకున్న తర్వాత మొత్తం విషయాన్ని ఆయనకు నివేదిస్తానని ప్రధాన కార్యదర్శి వారికి చెప్పారు. విపక్షాలు  సర్కారు చర్యను తప్పుపట్టాయి.

మరిన్ని వార్తలు