రహస్య ఉరితీతలు వద్దు

28 May, 2015 08:55 IST|Sakshi
రహస్య ఉరితీతలు వద్దు

దేశంలోని పలు జైళ్లలో కొనసాగుతోన్న దోషుల రహస్య ఉరితీతలపై సుప్రీం కోర్టు మండిపడింది. కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, పార్లమెంటుపై దాడికేసులో దోషి అఫ్జల్ గురు సహా మరణశిక్ష పడిన ఎటువంటివారినైనా  సరే  రహస్యంగా ఉరితీయడం  సరికాదని పేర్కొంది. దోషులు కూడా గౌరవసంపత్తిని కలిగి ఉంటారని, రహస్య శిక్షల అమలు వారిని అవమానపర్చడంలాంటిదేనని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

ఒకరు దోషిగా నిరూపణ అయి, మరణశిక్షకు గురైనంత మాత్రాన వారు జీవించే హక్కును కోల్పోరని, భారత రాజ్యాంగంలోని 21 ఆర్టికల్ ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది. కిందికోర్టుల్లో శిక్ష పడినవారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం దగ్గరినుంచి రాష్ట్రపతి, గవర్నర్ క్షమాభిక్షను కోరేవరకు గల అన్ని అవకాశాల్ని వినియోగించుకునేలా చూడాలంది.

తప్పనిసరి కేసుల్లో ఉరిశిక్షకు ముందు దోషులు తమ కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశాన్ని తప్పక కల్పించాలని తెలిపింది. కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును 2013లో ఢిల్లీలోని తీహార్ జైలులో రహస్యంగా ఉరితీయడంపై అప్పట్లో పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు