స్టార్‌కు ఓ న్యాయం... మాకో న్యాయమా?

17 May, 2019 08:30 IST|Sakshi

ప్రభుత్వానికి రాజీవ్‌ హత్య కేసు నిందితుల ప్రశ్న 

సమాచార హక్కు చట్టంతో పలు అంశాలు వెలుగులోకి 

బట్టబయలు చేసిన పేరరివాలన్‌ తరఫు న్యాయవాదులు

సంజయ్‌ తరహాలో రాజీవ్‌ కేసు నిందితుల విడుదలకు పట్టు

సాక్షి, చెన్నై: బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌కు ఓ న్యాయం...తమకు మరో న్యాయమా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని రాజీవ్‌ హత్యకేసు నింధితులు ప్రశ్నించే పనిలో పడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సంజయ్‌దత్‌ను విడుదల చేసినట్టుగానే రాజీవ్‌ హత్య కేసు నిందితుల్ని కూడా విడుదల చేయాలని న్యాయవాదులు పట్టుబట్టే పనిలో పడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్, రవిచంద్రన్‌తో పాటు ఏడుగురి విడుదల వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించినా, రాజ్‌భవన్‌లో స్పందన లేని దృష్ట్యా, చివరకు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్నిస్తూ నిందితుల తరఫున రవిచంద్రన్‌ ఓలేఖ కూడా రాశారు.

నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పేరరివాలన్‌ కొన్నేళ్లుగా చేసిన న్యాయ పోరాటం, తీవ్ర ప్రయత్నాలకు ఫలితంగా ప్రస్తుతం ఓ కేసు విషయంగా కీలక ఆధారాల్ని సేకరించారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా జైలుశిక్షను సైతం అనుభవించిన బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ విడుదల వ్యవహారాన్ని పేరరివాలన్‌ గతంలో అస్త్రంగా చేసుకున్నారు. సీబీఐ విచారిస్తున్న, విచారించిన కేసుల్లో ముందస్తు విడుదల వ్యవహారంలో కేంద్రం ఆదేశాలు, నిర్ణయం తప్పనిసరి అన్న వాదనను పరిగణించి సమాచార హక్కు చట్టం మేరకు సంజయ్‌దత్‌ విడుదలకు వర్తింపచేసిన నిబంధనల వివరాలను పేరరివాలన్‌ సేకరించారు. ఇందులోని అంశాలన్ని పేరరివాలన్‌ తరఫు న్యాయవాదులు మీడియా దృష్టికి తెచ్చారు.

ఇదేనా న్యాయం..
సంజయ్‌దత్‌ను ముందస్తుగా విడుదల చేసిన వ్యవహారంలో ఎలాంటి కేంద్రం అనుమతుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం పొందనట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు తేలాయి. మహారాష్ట్ర జైళ్ల శాఖ నింబంధనలకు అనుగుణంగానే ఆయన్ను విడుదల చేసి ఉండటం గమనార్హం. సంజయ్‌ దత్‌కు శిక్ష విధించిన సమయంలో కోర్టు తీవ్రంగానే స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మరిన్ని వివరాలను రాబట్టి ఉన్నారు. అలాగే, సంజయ్‌ దత్‌ కేసును సీబీఐ విచారించిందని, అది కూడా బాంబు పేలుళ్ల కేసు అని, ఆ కేసులో కేంద్రం అనుమతి అన్నది పొందనప్పుడు, ఈ ఏడుగురి విడుదల  విషయంలో మాత్రం ఎందుకు కేంద్రం అనుమతి...? అని పేరరివాలన్‌  న్యాయవాదులు  ప్రశ్నించారు. సంజయ్‌ దత్‌కు ఓ న్యాయం...రాజీవ్‌ హత్య కేసు నింథితులకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తుండటం విచారకరంగా పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టంలోని అంశాల్ని అస్త్రంగా చేసుకుని న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అదే సమయంలో ఆ సమాచార హక్కు చట్టం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జైళ్ల శాఖ నిబంధనల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సెక్షన్‌ 161 మేరకు ఎవ్వరి అనుమతి అన్నది లేకుండా తమిళనాడు ప్రభుత్వానికే ఆ ఏడుగురి విడుదల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. అంతే గాని, మంత్రి వర్గం ఆమోదాన్ని రాజ్‌ భవన్‌కు పంపించి, అక్కడ ఆమోదం కోసం ఎదురు చూడకుండా,త మిళనాడు ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్‌చేస్తున్నారు.

మరిన్ని వార్తలు