ఇంధన రంగంలో సహకారమే కీలకం

11 Dec, 2014 01:59 IST|Sakshi
ఇంధన రంగంలో సహకారమే కీలకం

ఢిల్లీ చేరుకున్న పుతిన్
 
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సులో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అణు ఇంధనం, రక్షణ, హైడ్రోకార్బన్ల వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై వారివురూ ప్రధానంగా చర్చించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు స్వాగతం పలికారు. గురువారం ఉదయం హైదరాబాద్ హౌస్‌లో సమావేశం జరగనుంది.  పుతిన్ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఉక్రెయిన్ వ్యవహారంపై అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్‌తో ఆర్థిక బంధాన్ని పరిపుష్టం చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నారు.

శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఇరు దేశాలు 15-20 ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత్‌కు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతులతోపాటు ఆర్కిటిక్ మహాసముద్రంలో చమురు అన్వేషణలో ఓఎన్‌జీసీని భాగస్వామిని చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. అణు ఇంధన రంగంలో 14-16 అణు  ప్లాంట్ల ఏర్పాటుకు బదులు 20-24 ప్లాంట్ల ఏర్పాటుకు రష్యా ప్రతిపాదించే అవకాశం ఉంది.
 
 

>
మరిన్ని వార్తలు