గ్రామీణ భారతానికి ‘సహకారం’

22 Sep, 2017 01:20 IST|Sakshi
గ్రామీణ భారతానికి ‘సహకారం’

2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపయ్యేలా కృషిచేయండి
► తేనెటీగల పెంపకం, సముద్ర నాచు వంటి వాణిజ్య అంశాలపై దృష్టి
► సహకార సంఘాలకు ప్రధాని మోదీ పిలుపు
► సహకార సంఘాల ద్వారా వేపనూనె సేకరణ జరగాలని సూచన  


న్యూఢిల్లీ: 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపుచేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా రైతులకు సహాయం చేయాలని సహకార సంఘాలను ప్రధాని మోదీ కోరారు. తేనెటీగల పెంపకం, ఫార్మారంగంలో మంచి డిమాండ్‌ ఉన్న సముద్రపు నాచు (సీవీడ్‌) పెంపకం వంటి కొత్త వాణిజ్య అంశాలపై దృష్టి పెట్టేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మహారాష్ట్ర సహకార నేత లక్ష్మణ్‌ మాధవ్‌రావ్‌ ఇనామ్‌దార్‌ శతజయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ‘సహజంగానే భారతదేశంలో సహకార రంగం పురోగతి చెందేందుకు అనుకూల పరిస్థితులుంటాయి. చాలా రంగాల్లో సహకార రంగం ప్రభావం కారణంగా సానుకూల ఫలితాలొచ్చాయి. పాత పద్ధతులను వదిలేయండి. ఉత్తమ పద్ధతులను ఎంపిక చేసుకుని ముందుకు సాగండి’ అని మోదీ పేర్కొన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా వారిని ముందుకు నడిపించాలని.. గ్రామీణ భారతం వెనకబడకుండా చూడాలని పిలుపునిచ్చారు.

పాడి రైతులకు ప్రై‘వేటు’
‘డైరీ సహకార సంఘాలతో అనుసంధానమైన పాడి రైతులకు మేలు జరుగుతుంది. అయితే వారు పాలను ప్రైవేటు సంస్థలకు అమ్మడం వల్లే నష్టపోతున్నారు’ అని మోదీ అన్నారు. అందుకే రైతులకు మేలు జరిగే సహకార వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతానికి చక్కెర, పాడి రంగాల్లోనే ఎక్కువగా సహకార సంఘాలున్నాయన్నారు. యూరియా ఎరువులకు కోటింగ్‌ కోసం వేపనూనెకు మంచి డిమాండ్‌ ఉందని.. మహిళలు వేప నూనె తయారీకి కావాల్సిన వస్తువులను సేకరించాలని సూచించారు. సహకార ఉద్యమం ద్వారా తేనెటీగల పెంపకంతో తీపి విప్లవం (స్వీట్‌ రివల్యూషన్‌) తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘తేనెతోపాటుగా తేనె మైనానికి (బీస్‌ వ్యాక్స్‌)కు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంద’ని  వివరించారు.  

సముద్ర నాచుకు మంచి డిమాండ్‌
మత్స్య పరిశ్రమలోనూ మంచి లాభాలున్నాయని.. సీజన్‌ లేని సమయంలో సముద్ర నాచును పెంచటాన్ని ప్రోత్సహించటం ద్వారా రైతులకు మరింత మేలు కలుగుతుందని మోదీ చెప్పారు. సీవీడ్‌కు ఫార్మాలో డిమాండ్‌ ఉందని సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వాణిజ్య అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇనామ్‌దార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మోదీ.. ఆయన జీవితం ఎప్పటికీ స్ఫూర్తివంతమేనన్నారు.1979లో ముంబై కేంద్రంగా ‘సహకార భారతి’ని స్థాపించిన ఇనామ్‌దార్‌.. సహకార సంఘాల ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇనామ్‌దార్‌పై రాసిన రెండు పుస్తకాలను మోదీ ఆవిష్కరించారు.

నేడు వారణాసికి మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్ర, శని వారాల్లో తన నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 17 మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయటంతోపాటు పలు బహిరంగ సభల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలో ఏర్పాటుచేసిన అన్నక్షేత్ర (సమాజ పాకశాల)ను జాతికి అంకితం చేస్తారు. వారణాసి–వడోదర ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన అనంతరం డీజిల్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (డీఎల్‌డబ్ల్యూ)ను ప్రారంభించి అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. దుర్గాకుండ్‌లో దుర్గాదేవి, తులసీ మానస్‌ ఆలయాలను సందర్శించి రామాయణంపై ఓ స్మారక స్టాంపును విడుదల చేస్తారు. వారణాసి శివార్లలోని షహన్షాపూర్‌లో పశు ఆరోగ్య మేళాను ప్రారంభించిన అనంతరం రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.

మరిన్ని వార్తలు