ఇంతకన్నా దారుణం ఉండదేమో!

10 Feb, 2018 11:44 IST|Sakshi

శ్రీనగర్‌ : కనిపించకుండా పోయిన 8 ఏళ్ల బాలిక అతికిరాతకంగా హత్యాచారానికి గురికావటం జమ్ములో కలకలం రేపింది. ఓవైపు 20 రోజులుగా జమ్ము అట్టుడుకిపోతుండగా.. కేసు దర్యాప్తు చేపట్టిన క్రైమ్‌ బ్రాంచ్‌ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. చిన్నారి మిస్సింగ్‌ కేసును దర్యాప్తు చేపట్టిన అధికారే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. 

అసలేం జరిగింది... జమ్ముకి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న కతువా జిల్లా రసానా గ్రామంలో నోమాద్‌ తెగకు చెందిన ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లోని 8 ఏళ్ల బాలిక గుర్రాలను మెపుతూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. గత నెల 10వ తేదీ నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కతువా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నాలుగు రోజులైనా ఎలాంటి ఫలితం కనిపించకపోవటంతో ఈ కేసును పర్యవేక్షించాలని హీరానగర్‌ ఎస్‌పీవో ‘దీపక్‌ ఖుజారియా’ను ఉన్నతాధికారులు నియమించారు. అయినప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చివరకు వారం రోజుల తర్వాత శివారులోని పొలాల్లో బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆగ్రహ జ్వాలలు... బాలిక అతిదారుణంగా అత్యాచారానికి గురైందన్న వార్త తెలీగానే నోమాద్‌ తెగలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతా రోడ్డున చేరి ధర్నా ప్రారంభించారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీస్‌ శాఖ దీపక్‌ను కేసు నుంచి తప్పించి క్రైమ్‌ బ్రాంచ్‌ను రంగంలోకి దించింది. దర్యాప్తులో దీపక్‌ ఆ బాలికను వారంపాటు బంధించి అత్యాచారం చేసి హత్య చేశాడని.. ఓ బాలుడు కూడా అతనికి సహకరించాడని తేలింది.

‘ఘటనకు దీపక్‌(28) కారణమని దర్యాప్తులో వెల్లడైంది. అతనికి వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించాం. బాలికపై కొంత కాలంగా నిఘా వేసి ఉంచారు. కిడ్నాప్‌, రేప్‌, హత్య కేసులో దీపక్‌ హస్తం కూడా ఉంది. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు కూడా’ అని క్రైమ్‌ బ్రాంచ్‌ అదనపు డీజీపీ అలోక్‌ పూరి వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఈ నేరాన్ని చేశారని.. దీని వెనుక బలమైన కారణమే ఉందని... ఈ సమయంలో మిగతా వారి పేర్లు వెల్లడించటం కుదిరేపని కాదని ఆయన తెలిపారు. ఇక ఈ ఘటన నోమాద్‌ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.

మొదటి నుంచి అనుమానాలు... ఈ ఘటనలో దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి దీపక్‌ ఖుజారియాపై బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తూనే వస్తోంది. విచారణలో అలసత్వం ప్రదర్శించటం.. అడిగినందుకు తన కుటుంబ సభ్యులు, గ్రామస్థులపై దాడి చేశారని బాలిక తండ్రి చెబుతున్నారు. ఒకానోక దశలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా దీపక్‌ యత్నించినట్లు నోమాదా తెగ ఉద్యమకారులు ఆరోపించారు. మరోపక్క ఈ దారుణంలో పలువురు స్థానిక నేతల హస్తం ఉన్నట్లు స్థానిక మీడియాల్లో కథనాలు వస్తుండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు