ఫొటో జ‌ర్న‌లిస్ట్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

22 Apr, 2020 12:40 IST|Sakshi

శ్రీనగర్: జాతి విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతూ పోస్టులు పెడుతున్న ఫొటో జ‌ర్న‌లిస్టుపై జ‌మ్మూ క‌శ్మీర్‌ పోలీసులు మంగ‌ళ‌వారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. న్యాయ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌(యూపీపీఎ) కింద ఆమెను అదుపులోకి తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. దీనిపై ఆగ్ర‌హం చెందిన జ‌ర్న‌లిస్టు సంఘాలు పోలీసుల చ‌ర్య‌ను తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నాయి. జ‌మ్ము క‌శ్మీర్‌కు చెందిన పోలీసు సోష‌ల్ మీడియాలో గ‌తంలో చేసిన వివాదాస్ప‌ద ట్వీట్‌ను మ‌రోసారి తెర‌మీదకు తీసుకు రావ‌డంతో స‌ద‌రు పోలీసు త‌న ట్వీట్‌ను తొల‌గించాడు. వివ‌రాల్లోకి వెళితే.. 2002లో గుజ‌రాత్‌లో అల్ల‌ర్లు చెల‌రేగిన‌ప్పుడు మోదీకి.. "ముస్లింల ప్రాణాలు పోయినందుకు మ‌న‌స్తాపం చెందారా? అన్న ప్ర‌శ్న ఎదురైంది. దీనికి ఆయ‌న స‌మాధాన‌మిస్తూ "కారు కింద కుక్క‌పిల్ల ప‌డ్డా బాధ‌గానే ఉంటుంద"‌ని స‌మాధాన‌మిచ్చిన విష‌యం తెలిసిందే. (శభాష్‌ అనిపించుకున్న ఐఏఎస్‌ అధికారిణి)

దీన్ని ఉటంకిస్తూ సైబ‌ర్ విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా ప‌నిచేస్తున్న‌ తాహిర్ అష్రిఫ్ 2013లో.. ఈ మాట‌లే మోదీ అస‌లు స్వ‌భావాన్ని నిరూపిస్తున్నాయంటూ అత‌న్నో "శాడిస్ట్"‌గా అభివ‌ర్ణిస్తూ ట్వీట్ చేశాడు. తాజాగా ఫొటోగ్రాఫ‌ర్ అరెస్ట‌వ‌డంతో ఈ ట్వీట్ మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. "ముందు ఇత‌న్ని అరెస్ట్ చేయండి", "జాతి వ్య‌తిరేక నినాదాలు చేస్తున్న‌ ఇలాంటివారిని ప‌ట్టుకోండి" అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో అ‌ధికారులు వెంట‌నే స‌ద‌రు పోలీసును ట్వీట్ తొల‌గించాల్సిందిగా ఆదేశించారు. ఇదిలావుండ‌గా జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని ర‌ద్దు చేసి, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన స‌మ‌యంలోనూ అనేక‌మంది జ‌ర్న‌లిస్టుల‌ను పోలీసులు విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టికైనా జ‌మ్మూకాశ్మీర్‌లో జ‌ర్న‌లిస్టుల‌పై బెదిరింపులు ఆపాల‌ని వారు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు