కూరగాయల సంతలో విధ్వంసం.. ఎస్సై సస్పెన్షన్‌

6 Jun, 2020 09:17 IST|Sakshi

లక్నో: పోలీస్‌ జీపుతో కూరగాయల మార్కెట్‌లో హల్‌చల్‌ చేసి భయాందోళనలు సృష్టించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడమే కాక ప్రయాగ్‌రాజ్‌ జిల్లా నుంచి బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌ జిల్లా గూర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం నాడు చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమిత్‌ ఆనంద్‌ గురువారం నాడు జరిగిన వారాంతపు సంతలో పోలీస్‌ జీపుతో కూరగాయల మార్కెట్‌లో విధ్వంసం సృష్టించాడు. అమ్ముకునేందుకు పోసిన కూరగాయలను పోలీస్‌ జీపుతో అతివేగంగా వచ్చి వరుసగా తొక్కించాడు. అంతటితో ఆగక వెహికల్‌ను రివర్స్‌ చేసి మిగతా కూరగాయల పైనుంచి పోనిచ్చాడు. మార్కెట్‌ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలని, కూరగాయలు అమ్మొద్దన్న తన ఆదేశాలు పాటించని కారణంగా ఆగ్రహించిన ఎస్సై ఇలా చేసినట్లు సమాచారం. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దాంతో ఉన్నతాధికారులు సుమిత్‌పై చర్యలు చేపట్టారు. (సొంతంగా రెండు చక్రాల సవారీ..)

ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌ ఎస్‌ఎస్‌పీ సత్యార్థ్‌ అనిరుద్‌ పంకజ్‌ శుక్రవారం నాడు మీడియా ఎదుట మాట్లాడుతూ... సదరు ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేశాము. ఇది హేయమైన చర్య. దర్యాప్తుకు ఆదేశించాము’ అని పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారం, శుక్రవారం నాడు సంతకు అనుమతి ఉంది. కానీ గ్రామస్తులు గురువారం సైతం సంతను నిర్వహించారు. దాంతో మార్కెట్‌ను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా సుమిత్‌ వారికి తెలిపాడు. వారు వినకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డట్లుగా తెలిసిందన్నారు. లాక్‌డౌన్‌ కొనసాగింపు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సంతకు అనుమతి తెలపగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. (15 రోజుల్లోగా పంపేయండి)

మరిన్ని వార్తలు