బతకాలంటే డీల్‌ చేస్కో

16 Apr, 2018 03:35 IST|Sakshi
లేఖ్‌రాజ్‌సింగ్‌ యాదవ్‌, సునీత్‌కుమార్‌ సింగ్‌

యూపీలో స్థానిక నేతకు పోలీసుల బెదిరింపులు

పట్టించుకోకపోవడంతో ఎన్‌కౌంటర్‌కు స్కెచ్‌

లక్నో: ప్రాణాలతో ఉండాలనుకుంటే బీజేపీ నేతలతో డీల్‌ చేసుకోవాలని ఓ హిస్టరీ షీటర్‌ను సాక్షాత్తూ ఓ పోలీస్‌ ఉన్నతాధికారే బెదిరించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో సంబంధిత అధికారిని యూపీ పోలీస్‌శాఖ సస్పెండ్‌ చేసింది. ఝాన్సీ జిల్లాలోని మౌరానీపూర్‌కు చెందిన స్థానిక నేత లేఖ్‌రాజ్‌సింగ్‌ యాదవ్‌పై 70 కేసులు ఉండగా, ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు ఫోన్‌ చేసిన మౌరానీపూర్‌ ఎస్‌హెచ్‌వో సునీత్‌కుమార్‌ సింగ్‌.. ‘ఎన్‌కౌంటర్ల సీజన్‌ మొదలైంది. నీ మొబైల్‌ నంబర్‌పై ఇప్పటికే నిఘాపెట్టాం. నువ్వు త్వరలోనే ఎన్‌కౌంటర్‌లో చనిపోవచ్చు. ప్రాణాలతో ఉండాలనుకుంటే జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ దూబే, బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్‌ సింగ్‌లతో డీల్‌ చేస్కో. లేదంటే నీకు ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు. నేను చాలాపెద్ద నేరస్తుడిని. ఇప్పటికే చాలామందిని చంపి పారేశాను’ అని హెచ్చరించారు.

దీన్ని యాదవ్‌ పట్టించుకోకపోవడంతో అదేరోజు సాయంత్రం హర్‌కరణ్‌పురా గ్రామంలో ఆయన దాగున్న ఇంటిని సునీత్‌ నేతృత్వంలోని పోలీసుల బృందం చుట్టుముట్టింది. దీంతో ఇరువర్గాలకు మధ్య కాల్పులు జరగ్గా.. యాదవ్‌ తన అనుచరులతో అక్కడ్నుంచి పరారయ్యాడు. అనంతరం ఎస్‌హెచ్‌వో సునీత్‌ తనతో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను లేఖ్‌రాజ్‌ మీడియాకు విడుదల చేశాడు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సదరు అధికారిని సస్పెండ్‌చేసిన పోలీస్‌శాఖ.. విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో నేరస్తుల్ని ఏరివేయడానికి ఈ ఏడాది పోలీసులు చేసిన 1,200 ఎన్‌కౌంటర్లలో 34 మంది క్రిమినల్స్‌ చనిపోగా, 265 మంది గాయపడ్డారు.

మరిన్ని వార్తలు