ట్రక్కులపై నిషేధం

10 Nov, 2017 10:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పొగమంచు, వాయు కాలుష్యంపై నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న పర్యావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకూ సరి-బేసి విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే సీఎన్‌జీ వాహనాలకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

దేశరాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన భారీ ట్రక్కులు, లారీల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి వాటికి మినమాయింపులను ప్రభుత్వం కల్పించింది. అప్పటికే ఢిల్లీ చెక్‌ పాయింట్ల వద్దకు చేరుకున్న ట్రక్కులను ఇతర నగరాలకు మళ్లిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు శాఖ.. ఢిల్లీకి వచ్చే అన్ని రహదారుల్లోనూ చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 15 వరకూ ట్రక్కులపై నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు