బిహార్‌లో అమాంతం పెరిగిన క‌రోనా కేసులు

11 May, 2020 12:13 IST|Sakshi

పాట్నా : వ‌ల‌స కూలీల ద్వారా క‌రోనా కేసులు బిహార్‌లో పెరిగినట్టు తెలుస్తోంది. ఆదివారం నాటికి 83 ప్ర‌త్యేక రైళ్ల‌లో దాదాపు లక్ష‌కు పైగా వ‌ల‌స‌దారులు వివిధ రాష్ట్రాల నుంచి బిహార్‌కు తిరిగి వ‌చ్చారు. దీంతో ఒక్క‌సారిగా కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెర‌గ‌డం అధికారుల్లో ఆందోళ‌న క‌లిగిస్తుంది. వీరి నుంచి 142 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన కేసుల సంఖ్య 673కు చేరింది. వ‌ల‌స కూలీలు త‌మ స్వ‌స్థ‌లాల‌కు చేరుకునేందుకు కేంద్రం అనుమ‌తిచ్చిన నేప‌థ్యంలో మే 4 నుంచి మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఢిల్లీ స‌హా వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు బిహార్‌కు చేరుకున్నారు. (కరోనా కల్లోలం: కార్మికుడు బలి)

వ‌ల‌స కూలీల ద్వారా రాష్ట్రంలో ఉన్న 38 జిల్లాల్లో 37 జిల్లాల వాసుల‌కు క‌రోనా సోకింది. ఇంత‌కుముందు కేవ‌లం 1.8 శాతంగా మాత్ర‌మే ఉన్న కరోనా కేసులు వ‌ల‌స కూలీల కార‌ణంగా 4.5 శాతానికి చేరుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రానికి వ‌చ్చిన వ‌ల‌స‌కార్మికుల్లో కేవ‌లం 43 మందికే క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింద‌ని అధికారులు పేర్కొన్నారు. దీంతో మిగిలిన వ‌ల‌స కూలీల‌ను ఆయా స్వ‌స్థ‌లాల‌కు పంపిచిన‌ట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం  రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో 3,474 క్వారంటైన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు  బిహార్ సమాచార, ప్రజా సంబంధాల కార్యదర్శి అనుపమ్ కుమార్ వెల్లడించారు. ఈ కేంద్రాల్లో 98,814 మందికి వ‌స‌తి క‌ల్పించిన‌ట్లు చెప్పారు. రానున్న రోజుల్లో 86 ప్ర‌త్యేక రైళ్లలో ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకున్న బిహార్ వాసుల‌ను తిరిగి ర‌ప్పించ‌డానికి ప్ర‌భుత్వం త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 2 లక్ష‌ల‌కు పైగానే వ‌ల‌స కూలీలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం న‌మోదైన 673 క‌రోనా కేసుల్లో 354 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

మరిన్ని వార్తలు