కరోనా టెన్షన్‌; రోజుకు 24 మంది మృతి

28 May, 2020 15:21 IST|Sakshi

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి గుజరాత్‌లో వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో గుజరాత్‌లో కొత్తగా 326 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 15 వేలు దాటేసింది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 70 శాతంపైగా అహ్మదాబాద్‌ జిల్లాలోనే నమోదు కావడం అక్కడ వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. రోజుకు 24 మంది చొప్పున గత వారం రోజుల్లో 169 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. బుధవారం కొత్తగా 256 కేసులు నమోదు కావడంతో అహ్మదాబాద్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య 11 వేలు దాటింది.

రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలను విశ్లేషిస్తే గత వారం రోజుల్లో గంటకు ఒకరు చొప్పున కరోనా బాధితులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మే 19 వరకు అహ్మదాబాద్‌లో 576 మరణాలు నమోదయ్యాయి. తర్వాత నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో 19 నుంచి 26 వరకు వారం రోజుల వ్యవధిలో 169 మరణాలు సంభవించాయి. అంటే రోజుకు 24 మంది ప్రాణాలు కోల్పోయారన్న మాట. గుజరాత్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా కారణంగా 938 మంది చనిపోగా, ఒక్క అహ్మదాబాద్‌ జిల్లాలోనే 764 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,097కి చేరింది. 7,549 మంది కరోనా బాధితులు కోలుకోగా, 80,363 మంది ప్రభుత్వ క్వారెంటన్‌ కేంద్రాల్లో ఉన్నారు. (24 గంటల్లో 194 మంది మృతి)

కరోనా కేసులు తక్కువగా చూపించేందుకేనా?
లాక్‌డౌన్‌ నిబంధనలు సరిగా అమలు చేయకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని జనం ఆరోపిస్తున్నారు. షహిబాగ్‌, కాలుపూర్‌ కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల హోల్‌సేల్‌ దుకాణాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు. కరోనా లక్షణాలతో శాంతబెన్‌ షా అనే 92 ఏళ్ల వృద్ధురాలు అహ్మదాబాద్‌లోని కోవిడ్‌-19 ప్రత్యేక ఆసుపత్రిలో మే 23న చేరినా ఆమెకు పరీక్షలు నిర్వహించలేదు. బుధవారం ఆమె కన్నుమూశారు. అంత్యక్రియలు ఇంకా నిర్వహించలేదు. కరోనా నిర్ధారణ పరీక్షల నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులను తక్కువగా చూపించేందుకే పరీక్షలు చేయడం లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు నాసిరకం పీపీఈ కిట్ల వివాదంలో విజయ్‌ రూపానీ సర్కారుకు ప్రతిపక్షాలు ఊపిరి సలపనీయడం లేదు. (హైదరాబాద్‌లో మళ్లీ విజృంభిస్తుంది)   

>
మరిన్ని వార్తలు