పరీక్షల రద్దుకే సీబీఎస్‌ఈ మొగ్గు?

20 Jun, 2020 13:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోని పరీక్షల నిర్వహణపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. 10వ తరగతి, 12వ తరగతి మినహా మిగతా తరగతుల వారిని ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్‌ చేసింది. కాగా, 12వ తరగతి పరీక్షలను జులై 1-15 మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను రద్దుచేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో  10, 12వ తరగతి పరీక్షల రద్దు అవకాశాలను పరిశీలించాలని సీబీఎస్ఈ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. (ఇప్పట్లో విద్యార్థులకు పరీక్షలు వద్దు!)

‘కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు.  అలా అని ఆలస్యంగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే 19 రాష్ట్రాలు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాయి. అంతేకాకుండా అనేక రాష్ట్రాలు పలితాలు కూడా విడుదల చేశాయి. దీంతో కొన్ని యూనివర్సిటీలు కొత్త అడ్మిషన్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. అప్పుడు సీబీఎస్‌ఈ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. 

దీంతో 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు సైతం రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పాస్‌ చేసి గ్రేడ్స్‌ ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే మార్కులు/గ్రేడ్స్‌ విషయంలో ఎవరికైన అభ్యంతరాలు ఉంటే వారికి తర్వాత పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన కూడా చేస్తున్నాం. రెండు మూడు రోజుల్లో 12వ తరగతి పరీక్షల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక జేఈఈ, నీట్‌ పరీక్షలు నిర్వహించడం ఆలస్యం అవుతుంది కావచ్చు. కానీ ఆ పరీక్షలు రద్దు చేయడం అసాధ్యం’ అని ఓ ప్రభుత్వాధికారి అనధికారికంగా తెలిపారు. (క‌రోనా సోకిన వ్య‌క్తి ఫోన్ చోరీ చేశాడు..)

మరిన్ని వార్తలు