5లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు

26 Mar, 2020 10:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలపై మహ్మమారి కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. ఏ ఒక్క దేశాన్నీ వదలకుండా ప్రజల ప్రాణాలను హరిస్తోంది. గురువారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాటిజివ్‌ కేసులు 4,17,417 నమోదు అయ్యి.. ఆ సంఖ్య ఐదు లక్షల చేరువలోకి వేగంగా వెళ్తోంది. మరోవైపు మృతుల సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది. కరోనా ధాటికి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 21,295కి చేరి విశ్వాన్ని వణికిస్తోంది. ఇక ఇటలీపై ఈ మహమ్మారి ఏమాత్రం కనికరం చూపడంలేదు. ఆ దేశంలో రోజురోజుకూ మరణాలు, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇటలో మొత్తం 74,386 పాజిటివ్ కేసులు, 7,503 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఇటలీ తర్వాత కరోనా అంతటి ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై చూపుతోంది. యూఎస్‌లో మొత్తం 68,421 కరోనా పాజిటివ్ కేసులు తేలగా.. 940కిపైగా మరణాలు సంభవించాయి. మరోవైపు స్పెయిన్, జెర్మనీ, ఇరాన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. స్పెయిన్‌ మృతుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. (నీకు క‌రోనా సోకింది.. యువతికి వేధింపులు)

ఇక భారత్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 649కి చేరింది. మృతుల సంఖ్య 13కి చేరింది. రాష్ట్రాల వారిగా మహారాష్ట్రలో అత్యధికంగా 124 కరోనా కేసులు నమోదైయ్యాయి. ఆ తరువాత కేరళ 112, తెలంగాణ 39, ఉత్తర ప్రదేశ్‌ 38, రాజస్తాన్‌ 36, ఢిల్లీలో 30 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశంలో 13 మంది మృతి చెందగా.. వారిలో మహారాష్ట్ర 3, గుజరాత్‌ 2, ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడుకు చెందిన వారు ఒక్కక్కరు చొప్పున ఉన్నారు. కాగా 42 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు