కరోనా: ఇరుగుపొరుగు వేధింపులతో..

14 Apr, 2020 13:22 IST|Sakshi

శివపురి: ప్రాణాంతక వైరస్‌పై పోరులో దేశమంతా సమైక్యతా స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కొంతమంది కారణంగా సమైక్యతా స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. కరోనా మహమ్మారి బారినపడి, చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఓ యువకుడు తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఇరుగుపొరుగు వారు తనను దూరంగా పెట్టడంతో అతడు ఆవేదనకు గురై ఈ కఠిన నిర్ణయంతీసుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని శివపురి పట్టణంలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల ఈ వ్యక్తి మార్చి 18న దుబాయి నుంచి వచ్చాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మార్చి 24న ఆసుపత్రిలో చేరాడు. ఏప్రిల్‌ 4న డిశ్చార్జి అయ్యాడు. ఇంటికి చేరిన అతడిని ఇరుగుపొరుగు ప్రజలు సామాజికంగా బహిష్కరించారు. ఎవరూ మాట్లాడేవారు కాదు. అంతేకాకుండా పాలు, కూరగాయలు అమ్మేవారిని కూడా యువకుడి ఇంటి వైపు రానిచ్చేవారు కాదు. ఇదంతా చూసి అతడు విసుగెత్తిపోయాడు. తన ఇంటిని అమ్మేసి, మరో చోటుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. కరోనాపై గెలిచిన తనను చుట్టుపక్కల ప్రజల వైఖరి ఓడించిందని బాధాతప్త హృదయంతో చెప్పాడు.  

దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని శివపురి ఎస్పీ రాజేశ్‌ సింగ్‌ చందల్‌ తెలిపారు. కరోనా నుంచి కోలుకుని వచ్చిన యువకుడితో ఇరుగు పొరుగు వారు వాగ్వాదానికి దిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కోవిడ్‌ బాధితులను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హోమ్‌ క్వారంటైన్‌ ఉన్న యువకుడి కుటుంబానికి అవసరమైన నిత్యవసర సరుకులు తామే అందజేస్తామన్నారు. (కరోనా కట్టడికి 7 సూత్రాలు చెప్పిన మోదీ)

మరిన్ని వార్తలు