కరోనాపై ప్రభుత్వానికి 10 ప్రశ్నలు

1 Apr, 2020 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాధికి సంబంధించి భీతావహ వదంతులను అరికట్టడంలో భాగంగా కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలంటూ సుప్రీం కోర్టు మీడియాకు మార్గనిర్దేశం చేసిన నేపథ్యంలో మీడియా కేంద్ర ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించింది.

1. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా నిర్ధారణ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే భారత్‌ ప్రభుత్వపరంగా ఉచితంగా, ప్రైవేటులో నాలుగున్నర వేల రూపాయలకు ఎందుకు నిర్వహిస్తోంది?

2. దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణకు ఎన్ని కిట్లు ఉన్నాయి? ఎన్ని దిగుమతి చేసుకున్నారు? మరెన్నింటి ఉత్పత్తికి చర్యలు తీసుకున్నారు? వీటికి సంబంధించిన వివరాలను భారత డ్రగ్‌ కంట్రోలర్‌ ఎందుకు విడుదల చేయడం లేదు?

3. దేశవ్యాప్తంగా వైద్యులతోపాటు వారి సిబ్బంది ఉపయోగించే గ్లౌజులు, మాస్క్‌లు, ఒవరాల్‌ సూట్స్‌ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది. ఉత్పత్తి బిడ్స్‌ ఎవరికిచ్చారు ? ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు?

4. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఒకే ఒక కంపెనీకి వీటిని ఉత్పత్తి చేసే బిడ్డింగ్‌ను అప్పగించడం, వీటిని ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేశంలోని దాదాపు వంద కంపెనీలకు ఈ బిడ్డింగ్‌ వివరాలు కూడా తెలియకపోవడంలో ఆంతర్యం ఏమిటీ?

5. ప్రస్తుతం దేశంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా నిర్ధారిత కేసులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఇంకా నిర్ధారణ కానీ, వైరస్‌ సోకిన లక్షణాలున్న వారికి ఎక్కడ చికిత్స అందజేస్తారు? వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడం ప్రమాదం కాదా? ప్రస్తుతం అలాంటి వారిని ఇంట్లోనే ఉండాల్సింది చెప్పి ఇళ్లకు పంపిస్తున్నారు. వారి వల్ల ఇంట్లోని ఇతరులకు వైరస్‌ సోకదా?

6. లాక్‌డౌన్‌ పేరుతో దేశవ్యాప్తంగా అవుట్‌ పేషంట్లకు చికిత్సను నిలిపి వేశారు. క్యాన్సర్, టీబీ, హెచ్‌ఐవీలాంటి ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేదలు ఎక్కడికి పోవాలి?

7. లాక్‌డౌన్‌ సందర్భంగా పలు రాష్ట్రాల్లో గర్భవతులకు, పిల్లలకు పోషకాహారం సరఫరా చేసే అంగన్‌వాడి కేంద్రాలను మూసివేశారు. లాక్‌డౌన్‌ పొడిగిస్తే పరిస్థితి ఏమిటీ? ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారా?

8. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందిలో ఆ వైరస్‌ బారిన పడి ఎవరైనా హెల్త్‌ వర్కర్‌ మరణిస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. మరణించిన పక్షంలోనే 50 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. హెల్త్‌ వర్కర్‌ జబ్బున పడితే చికిత్స ఖర్చులు ఎవరు భరిస్తారు? ఈ పరిహారం స్కీమ్‌ మూడు నెలలపాటే ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు? ఆ తర్వాత వైరస్‌ బారిన పడితే పరిస్థితి ఏమిటీ?

9. దేశవ్యాప్తంగా ఎంత మంది హెల్త్‌ వర్కర్లు ఉన్నారు? ఎంత మందికి 50 లక్షల బీమా వర్తిస్తుంది?

10. ప్రస్తుతానికి విదేశాల నుంచి వచ్చిన నిర్ధారిత కరోనా బాధితులు, వారితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కమ్యూనిటీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

మీడియా సంస్థలు విడి విడిగా ఈ ప్రశ్నలను ప్రభుత్వాధికారుల ముందు పలుసార్లు లేవనెత్తాయి. ఒక్కదానికి కూడా సమాధానం రాకపోవడంతో పలు మీడియా సంస్థలు కలిసి ఈ ప్రశ్నలను లిఖిత పూర్వకంగా ఉన్నతాధికారులకు సమర్పించాయి.

చదవండి: కరోనాపై పోరు: వారికి రూ. కోటి పరిహారం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా