కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి

27 Mar, 2020 15:24 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే 18 రకాల పరీక్షల కిట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో మూడు రకాల కిట్లను పుణేలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ వైరాలజి’ తయారు చేయగా, మిగతా 15 కిట్లకు ఇతర దేశాలు ఇచ్చిన లైసెన్సులు, సర్టిఫికెట్ల ఆధారంగా భారత్‌ ప్రభుత్వం సత్వర అనుమతి మంజూరు చేసింది. ఈ 18 రకాల కిట్ల తయారీకి, మార్కెటింగ్‌కు అనుమతి మంజూరు చేసినట్లు భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ వీజీ సోమని మీడియాకు తెలియజేశారు. ఇంతవరకు ఇలాంటి కిట్లు చాలినన్నీ అందుబాటులో లేకపోవడం  వల్ల ఇప్పటి వరకు కేవలం 26 వేల మందికి మాత్రమే కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగలిగారు. అందుకే వీటికి కేంద్రం సత్వర అనుమతిని మంజూరు చేయాల్సి వచ్చింది. 18 కిట్లలో 15 కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కూడా కేంద్రం అనుమతించినట్లు వీజీ సోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (చదవండి: కరోనా నిర్ధారణ నిమిషాల్లోనే!)

కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోకి వచ్చే భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) పర్యవేక్షణలోనే దేశంలో ఇంతవరకు కరోనా నిర్ధారిత పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు. వాటిని కూడా తొలుత పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పరిమితం చేయడం తీవ్ర జాప్యానికి దారితీసింది. అంతవరకు ప్రభుత్వం అనుమతించిన కరోనా పరీక్షలను పుణే సంస్థనే నిర్వహించాల్సి రావడం ఆలస్యానికి కారణమైంది. ఈ దశలో ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’ రంగంలోకి దిగడంతో లైసెన్స్‌ల ప్రక్రియ వేగవంతం అయింది. అమెరికాకు చెందిన ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్, యురోపియన్‌ సీఈ సర్టిఫికెట్‌ ఉన్నట్లయితే తమ దేశంలో ఈ కిట్ల తయారీకి వెంటనే అనుమతి ఇస్తామని, ఇప్పటి వరకు అలాగే ఇచ్చామని వీజీ సోమని తెలిపారు. నిబంధనల ప్రకారం కనీసం 200 మందిపై పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు పొందాల్సిన విదేశీ కంపెనీలు కేవలం 30 మందిపైనే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు పొందాయని, వాటి ప్రామాణికతను శంకించాల్సి వస్తుందని భారతీయ వైద్యులు అభిప్రాయపడ్డారు. (కరోనా: 300 మందిని బలిగొన్న విష ప్రచారం)

మరిన్ని వార్తలు