భారత్‌కు పెరుగుతున్న డిమాండ్‌

8 Apr, 2020 13:37 IST|Sakshi
నరేంద్ర మోదీ, జేర్‌ బోల్సోనారో(ఫైల్‌)

న్యూఢిల్లీ: మలేరియా నివారణ ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కోసం భారత్‌ను అభ్యర్థిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ ఔషధం కోసం బ్రెజిల్‌ కూడా భారత్‌కు ‘సంజీవని’ లేఖ రాసింది. కరోనా వైరస్‌ నివారణ పోరాటంలో ‘గేమ్‌ చేంజర్‌’గా భావిస్తున్నహైడ్రాక్సీక్లోరోక్విన్‌కు తమకు కూడా సరఫరా చేయాలని కోరింది. ‘రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి పవిత్ర ఔషధాన్ని తెచ్చి రాముడి సోదరుడు లక్క్ష్మణుడి ప్రాణాలు కాపాడు. అనారోగ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. బార్టిమేయుకు దృష్టిని పునరుద్ధరించాడు. సంయక్త బలగాలు, ఆశీర్వాదాలతో ప్రజలందరి మేలు కోసం భారత్‌, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగమించాలి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించండి. మీరు ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా భావిస్తాను’ అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో పేర్కొన్నారు. 

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమకు సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం క్లోరోక్విన్‌ ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించింది. అయితే  పొరుగు దేశం నేపాల్‌ సహా ప్రపంచ దేశాల నుంచి అభ్యర్థనల నేపథ్యంలో ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా సడలిచింది. మనకు సరిపడా ఉంచుకుని మిగతా వాటిని ఎగుమతి చేస్తామని భారత్‌ ప్రకటించింది. అమెరికాకు భయపడి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించారన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కరోనాతో విలవిల్లాడుతున్న దేశాలకు మానవతాదృక్పథంతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. (ట్రంప్‌ బెదిరించారు.. మీరు ఇచ్చేశారు)

మరిన్ని వార్తలు