కరోనాపై గెలుపు: అపూర్వ వీడ్కోలు

4 Apr, 2020 19:15 IST|Sakshi

తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధం అమలు చేస్తున్నాయి. కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. (ప్రధాని మోదీ ఈసారి ఏం చెబుతారో?

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం శనివారం నాటికి దేశవ్యాప్తంగా 184 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 42, కేరళలో 41, హరియాణాలో 24, ఉత్తరప్రదేశ్‌లో 19, కర్ణాటక 12, గుజరాత్‌లో 10 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా సోకి ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు తెలిపింది. 2902 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు పేర్కొంది. (ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ)

కాగా, కేరళలో కోవిడ్‌ బారిన పడి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఓ యువకుడికి అభినందన పూర్వక వీడ్కోలు లభించింది. కాసర్‌గఢ్‌లో మొట్టమొదటి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి అయ్యాడు. అతడు ఆస్పత్రి నుంచి వెళుతుండగా వైద్య సిబ్బంది, రోగులు కరతాళ ధ్వనులతో ఉత్సాహంగా  వీడ్కోలు పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ అతడు ముందుకు సాగాడు. కాగా, కోవిడ్‌ బారిన పడి కోలుకున్న కేరళలోని పతనంథిట్ట జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు థామస్‌ అబ్రహాం(93)ను, అతడి భార్య మరియమ్మ(88) శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. (కరోనా గుర్తింపునకు సరికొత్త యాప్‌)

మరిన్ని వార్తలు