మూడు నెలలు ముప్పుతిప్పలే!

4 Jul, 2020 08:55 IST|Sakshi

అమెరికా, దక్షిణాసియాలో విస్తరిస్తున్న మహమ్మారి

తాజా అధ్యయనంలో ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ హెచ్చరిక

నిరోధానికి ఇప్పుడే వేగంగా కేసులను గుర్తించాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశ (సెకండ్‌ వేవ్‌) ప్రమాదం పొంచి ఉందని, కొందరు అంటువ్యాధి నిపుణులు చెబుతున్నట్లుగా రెండో దశలో వైరస్‌ తీవ్రత తగ్గుతుందన్న భావన సరికాదని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ హెచ్చరించింది. అమెరికా, దక్షిణాసియా, మధ్యప్రాచ్యం అంతటా కరోనా మహమ్మారి వేగం పుంజుకుంటోందని, ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని వ్యా ఖ్యానించింది. కరోనా రెండో దశ సెప్టెంబర్‌లో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు తాజా అధ్యయన నివేదికను విడుదల చేసింది. (కరోనా కేళి.. జేబులు ఖాళీ!)

స్పానిష్‌ఫ్లూ తరహాలో...
‘వైరస్‌ ఇప్పటికీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది ఘోరంగా మారుతోంది. చాలా మంది ఇంకా దీనిబారిన పడే అవకాశం ఉంది’ అని లాన్సెట్‌ పేర్కొంది. 1918లో యావత్‌ ప్రపం చాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ మహమ్మారిని లాన్సెట్‌ ప్రస్తావించింది. దాని వ్యాప్తి తీవ్రత మొదటి దశ మార్చి–జూలై మధ్య కొనసాగగా, ఆగస్ట్‌–డిసెంబర్‌ మధ్య కొనసాగిన రెండో దశ ఘోర విషాదాన్ని మిగిల్చిందని గుర్తుచేసింది. ఈ వైరస్‌ బారినపడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల వరకు సంభవించిన మరణాల్లో ఎక్కువ భాగం 1918 సెప్టెంబర్‌–డిసెంబర్‌లోనే జరిగా యని నివేదిక పేర్కొంది. నాడు తొలి దశలో సరైన కట్టడి చర్యలు చేపట్టకపోవడం వల్ల వైరస్‌ రెండో దశ ప్రాణాంతకంగా మారిందని అభిప్రాయపడింది. ఇప్పుడు కూడా కరోనా మొదటి దశ తీవ్రత ప్రపంచవ్యాప్తంగా మార్చి నుంచే మొదలైందని, రానున్న రెండో దశను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలన్న దానిపై లాన్సెట్‌ పలు సూచనలు చేసింది.

లక్షణాలన్నీ కనిపించే దాకా ఆగొద్దు...
కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు కనిపించే వరకు వైరస్‌ బాధితులు నిరీక్షించకుండా కండరాల నొప్పి, అలసట, తలనొప్పి, విరేచనాలు, దద్దుర్లు వంటివి ఉన్నప్పుడే కరోనాగా అనుమానపడాల ని లాన్సెట్‌ స్పష్టం చేసింది. ఈ ప్రారంభ దశలోనే ఎవరికి వారు ఐసోలేషన్‌ అవడం వల్ల ఇతరులకు సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపింది. వైరస్‌కు సంబంధించిన అన్ని ఇన్ఫెక్షన్లను 48 గంటల్లోపు గుర్తించగలిగితే రెండో దశ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉందని అంచనా వేసింది.

దీర్ఘకాలిక లాక్‌డౌన్‌లు పరిష్కారం కాదు
సామూహిక పరీక్షలు నిర్వహించడం, ట్రేసింగ్‌ చేయడం, ఐసోలేషన్‌ వల్ల కొత్త కేసులు రాకుండా నివారించవచ్చన్న లాన్సెట్‌... దీర్ఘకాలికంగా లాక్‌డౌన్లు విధించడం వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పరిష్కారం కాదని అభిప్రాయపడింది. రెండు వారాలకు మించి లాక్‌డౌన్‌ ఉండ కూడదని సూచించింది. కరోనా వల్ల కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడకుండా చూడాలని సూచించింది.

జాగ్రత్తలతో ఎంతో మేలు..
కరోనా కట్టడిలో ప్రాథమిక రోగ నిర్ధారణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్, ఐసోలేషన్‌ అత్యంత కీలకమైనవని లాన్సెట్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రజలంతా తప్పనిసరిగా ఒకటి, రెండు మీటర్ల భౌతికదూరం నిబంధనను పాటించడం, చేతులను తరచూ కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం, సామూహిక సమా వేశాలను నివారించడం వంటివి తప్పనిసరిగా చేపట్టాలని సూచించింది. బలహీనంగా ఉన్న వారిపైనే వైరస్‌ దాడి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వాలు వైరస్‌ పునరుత్పత్తి సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది. తద్వారా భవిష్యత్తులో వచ్చే రెండో దశ వైరస్‌ దాడిని ఎదుర్కోవడానికి ఇప్పుడే దాని అంతు చూడాలని లాన్సెట్‌ స్పష్టం చేసినట్లు నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి డాక్టర్‌ కిరణ్‌ మాదల తెలిపారు. 

మరిన్ని వార్తలు