ఆదేశాలు ఉల్లంఘిస్తే ఆరు నెలలు జైలు..

23 Mar, 2020 13:03 IST|Sakshi

కరోనాపై ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షలు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విస్తరణను అరికట్టడంలో భాగంగా జనతా కర్ఫ్యూను పాటించాల్సిందిగా అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును ఆదివారం అక్షరాల అమలు చేసిన ప్రజలు సోమవారం నాడు అదే స్ఫూర్తిని కొనసాగించలేక పోతున్నారు. దీనిపై నరేంద్ర మోదీ అసంతప్తి వ్యక్తం చేయగా, జనతా కర్ఫ్యూను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ హెచ్చరించారు. ఆదివారం నాటి కర్ఫ్యూను ఈ నెల 31వ వరకు పొడిగిస్తున్నామని, దీన్ని కచ్చితంగా అమలు చేయడం కోసం ఈ ఉత్తర్వులను ‘ఎపిడెమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1897’ కింద నోటీఫై చేసినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. (లాక్డౌన్ : ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి)

కరోనా వైరస్‌ విస్తరించకుండా  నిరోధించడంలో భాగంగా ఈ చట్టంలోని రెండవ సెక్షన్‌ను ప్రయోగించాల్సిందిగా మార్చి 11వ తేదీన  కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టంలోని రెండవ సెక్షన్‌ కింద ప్రభుత్వాధికారులకు ప్రత్యేక అధికారాలు సిద్దిస్తాయి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రేవులు, విమానాశ్రయాలు, రైల్వే, బస్సు స్టేషన్లలోనే కాకుండా ఆయా ప్రయాణ సాధనాల్లో ప్రయాణికులను తనిఖీ చేయవచ్చు, రోడ్లపై తిరక్కుండా నియంత్రించవచ్చు. ఆంక్షలు విధించవచ్చు. అనుమానితులను నిర్బంధంగా వైద్య పరీక్షలకు, ఆ తర్వాత వైరస్‌ నిర్ధారితులను నిర్బంధ వైద్య శిబిరాలకు తరలించవచ్చు. వైరస్‌ బాధితుల చికిత్స విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన  ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవచ్చు. (కరోనా కట్టడి : ఇదీ అసలైన కర్ఫ్యూ)

అధికారుల ఆదేశాలను ఉల్లంఘించిన వ్యక్తులపై, సంస్థలపై ఐపీసీ (1860)లోని 188వ సెక్షన్‌ కింద శిక్షలు విధించవచ్చు. ఆరు నెలల జైలు లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇతన సముచిత శిక్షలు విధించే హక్కు సంబంధిత మేజిస్ట్రేట్లకు ఉంటుంది. ‘ఎపిడమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1897’ కింద అధికారాలకు లభించే ప్రత్యేక అధికారాలను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు. ఈ విషయంలో న్యాయ విచారణ నుంచి అధికారులకు చట్టం పూర్తి మినహాయింపు ఇస్తోంది. దీనిర్థం అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఐపీసీలోని 188వ సెక్షన్‌ కింద శిక్షార్హులవుతారు. (భారత్లో 8కి చేరిన కరోనా మరణాలు)

‘ఎపిడమిక్‌ డిసీసెస్‌ ఆఫ్‌ 1897’ను గుజరాత్‌లో కలరా నియంత్రణకు 1918లో, చత్తీస్‌గఢ్‌లో మలేరియా, డెంగ్యూ నియంత్రణకు 2015లో, పుణేలో స్వైన్‌ ఫ్లూ నియంత్రణకు 2009 ప్రయోగించారు. ఈ చట్టం స్వాతంత్య్రానికి పూర్వందైనా పటిష్టంగా పనికొస్తుందికనుక దీన్ని సవరించాల్సిన అవసరం రాలేదని రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కాశ్యప్‌ అభిప్రాయపడ్డారు. (కరోనాపై చైనా గెలిచిందిలా..!)

మరిన్ని వార్తలు