ఆ వాచ్‌మ్యాన్‌‌ నిజంగా దేవుడు!

26 Apr, 2020 16:35 IST|Sakshi
అర్థాకలితో అలమటిస్తున్న నేపాలీలు

ముంబై : కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న 200మంది నేపాలీలకు ఓ వాచ్‌మ్యాన్‌ అండగా నిలిచాడు. తాను పనిచేస్తూ తద్వారా వచ్చిన డబ్బులతో వారి కడుపు నింపుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పన్వెల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేపాలీకి చెందిన కొన్ని కుటుంబాలు కూలీ పనుల నిమిత్తం పన్వెల్‌ ఆడై గ్రామానికి వలస వచ్చాయి. మార్చి నెలలో విధించిన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఊర్లకు వెళ్లలేక అక్కడే ఇరుక్కుపోయాయి. ఈ నేపథ్యంలో కూలీ పనులు లేక, తినడానికి తిండిలేక దాదాపు 200 మంది అల్లాడిపోసాగారు. వీరి పరిస్థితి గమనించిన దర్బార్‌ బహదూర్‌ సాహీ అనే నైట్‌ వాచ్‌మ్యాన్‌‌ వీరికి సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు. తన అవసరాలకే చాలీ చాలని జీతం గడిస్తున్న అతను వారికి అవసరమైన నిత్యావసరాలను అందిస్తూ కడుపునింపుతున్నాడు. ( కరోనాతో వాటికి మంచి జరిగింది! )

దర్బార్‌ బహదూర్‌ సాహీ

అయితే అతడిచ్చే డబ్బుతో వారు కేవలం ఒక్కపూట తిండి మాత్రమే తినగలుగుతుండటం గమనార్హం. దీంతో వీరికి సహాయం చేయాలని కోరుతూ సాహీ ఎన్జీఓలు, దాతల చుట్టూ తిరుగుతున్నాడు. బహదూర్‌ షాహీ మాట్లాడుతూ.. ‘‘  వారంతా నేపాల్‌లోని మా చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వారు. నేను తప్ప వారిలో ఒక్కరు కూడా పనిచేయటం లేదు. వారికి ఇక్కడ తెలిసిన వారు కూడాలేరు. వాళ్లు, వాళ్ల పిల్లలు ఆకలితో అలమటించటం నేను చూల్లేకపోయాను. అందుకే నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను. నా దగ్గర ఉన్న నిత్యావసరాలు కూడా అయిపోవస్తున్నాయి. పాపం! ఇప్పటివరకు వాళ్లు ఒకపూట భోజనంతోటే గడుపుతున్నార’’ని బాధపడ్డాడు.

మరిన్ని వార్తలు