ఒక్కరోజే 114 మంది పోలీసులకు కరోనా

30 May, 2020 17:04 IST|Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా కేసులకు నిలయంగా మారిన మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న చాలామంది పోలీసులు వైరస్‌ బారిన పడటం కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కోవిడ్‌ బారిన పడ్డారు. దాంతో రాష్ట్ర పోలీసుల్లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,330 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక పోలీసు కోవిడ్‌తో చనిపోగా.. మొత్తం పోలీసు సిబ్బంది మృతుల సంఖ్య 26 కు చేరింది. ఇక కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషించే పోలీసు, వైద్య, పారిశుధ్య సిబ్బంది కోవిడ్‌ బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డయాబెటిస్‌, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 52 మంది పోలీసు సిబ్బందిని ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,682 కొత్త కేసులు నమోదవగా.. 116 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 62,228 కి చేరగా.. మరణాల సంఖ్య 2,098కి చేరుకుంది. కాగా, రాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే కేసులు సగానికిపైగా ఉన్నాయి. మహారాష్ట్రలోని ​మొత్తం కేసుల్లో అక్కడ 36,932 పాజిటివ్‌ కేసులు, 1173 మరణాలు నమోదయ్యాయి. ఇక నాలుగో లాక్‌డౌన్‌ మరో రోజులో ముగియనున్న తరుణంలో కేంద్రం సడలింపులు ఏమేరకు ఉంటాయో.. కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టే చర్యలేమిటో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు