డాక్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌లోకి 900 మంది

26 Mar, 2020 14:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మౌజ్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్‌లో పనిచేస్తున్న ఓ వైద్యుడితోపాటు అతని భార్య, కుమార్తెలకు కూడా కరోనా వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ అధికార యంత్రాంగం ఇటీవలి కాలంలో ఆ క్లినిక్‌కు వెళ్లిన దాదాపు 900 మందిని క్వారంటైన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చిన ఓ మహిళ కరోనా లక్షణాలతో క్లినిక్‌కు రావడంతో ఆ వైద్యునికి వైరస్‌ సోకినట్టుగా అధికారులు గుర్తించారు. 

ఇందుకు సంబంధించి ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌గా తేలిన వైద్యున్ని కలిసిన వారందరినీ 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకు 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు చెప్పారు. మార్చి 12న సౌదీ నుంచి వచ్చిన మహిళ మౌజ్‌పూర్‌ మొహల్లా క్లినిక్‌లోని డాక్టర్‌ను కలవడంతో అతనికి కరోనా సోకిందని చెప్పారు. ఆ మహిళకు ఐదు రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురికి కూడా కరోనా సోకిందని వెల్లడించారు. వారిలో ఆమె తల్లి, సోదరుడు, ఇద్దరు కుమార్తెలు, ఆమెను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చిన ఓ బంధువు ఉన్నారని చెప్పారు. అలాగే ఆమె బంధువులతోపాటు చుట్టుపక్కల ఉన్న 74 మందిపై నిఘా ఉంచామని తెలిపారు. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా కూడా మార్చి 12 నుంచి 18 మధ్య మొహల్లా క్లినిక్‌ వచ్చినవారు 15 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరింది.

క్లినిక్స్‌ యథావిథిగా కొనసాగుతాయి.. : కేజ్రీవాల్‌
మొహల్లా క్లినిక్‌ వైద్యునికి కరోనా సోకడంపై ముఖ్యమంత్రి అరవింద్‌ క్రేజీవాల్‌ స్పందించారు. ఈ ఒక్క ఘటన తప్పించి క్లినిక్స్‌ అన్ని తెరిచి ఉంటాయని కేజ్రీవాల్‌ ప్రకటించారు. లేకపోతే పేదలు వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు. క్లినిక్స్‌లో సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. మరోవైపు కరోనా సోకినవారి సంరక్షణ బాధ్యతలు చూస్తున్న వైద్య సిబ్బందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా టెస్ట్‌ల కోసం అనుమానితుల నమూనాలు సేకరిస్తున్న వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. 

24 గంటలపాటు నిత్యావసర వస్తువుల దుకాణాలు
ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల దుకాణాలన్నీ 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది. అలాగే పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారిని పాసులు అడగవద్దని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీఎం కేజ్రీవాల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

చదవండి : ఢిల్లీలో ఆ డాక్టర్‌ కుటుంబానికి కరోనా

మరిన్ని వార్తలు