కరోనా: క్వారంటైన్‌లో అనుమానితుల పైత్యం!

4 Apr, 2020 12:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గువాహటి: ప్రాణాలకు తెగించి కోవిడ్‌-19 బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యుల పట్ల కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణాల్లో ఈ ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా అస్సాంలోనూ అలాంటి దారుణమే వెలుగుచూసింది. వివరాలు... అస్సాంలోని గోలాఘాట్‌ జిల్లా నుంచి 8 మంది ఢిల్లీలోని తబ్లిగీ జమాతే కార్యక్రమానికి హాజరై వచ్చారు. వారికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే, వీరితో సన్నిహితంగా ఉన్న మరో 42 మంది అనుమానితులను జిల్లా ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచారు.
(చదవండి: ఢిల్లీ మసీదుల్లో భారీ సంఖ్యలో విదేశీయులు)

కానీ, వారు వైద్యానికి సహకరించకపోగా.. వార్డులో, కిటికీల్లోంచి బయట ప్రాంగణంలో ఉమ్ముతూ రచ్చ చేస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది వాపోయారు. పద్దతిగా ఉండాలని సూచించిన మెడికల్‌ సిబ్బందిపై కూడా వారు ఉమ్మేందుకు యత్నించారని యాజమాన్యం ఆరోపించింది. కాగా, గోలాఘాట్‌ ఆస్పత్రిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంతా బిశ్వా శర్మ పర్యటనకు ముందే ఈ ఘటన జరగడం విశేషం. దీంతో అధికారులు బయటి నుంచి కిటికీలు మూసేయించారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న మంత్రి బిశ్వా శర్మ మాట్లాడుతూ.. 

‘గోలాఘాట్‌ క్వారంటైన్‌లో ఉంటున్నవారు తమ ఆరోగ్యం బాగానే ఉందని భ్రమపడుతున్నారు. వారిని ఆస్పత్రికి బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది. చికిత్స తీసుకుంటున్న సమయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడించాం. ఎవరు చెప్పినా క్వారంటైన్‌లో ఉన్న అనుమానితులు వినిపించుకోవడం లేదు. ఇష్టారీతిన ప్రవర్తిస్తే వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని చెప్పినా లెక్కచేయడం లేదు. వారి ప్రవర్తన చాలా బాధగా ఉంది. అవగాహన పెంచుకుని ఆస్పత్రిక సిబ్బందికి సహకరించాలి. సమాజం కూడా పేషంట్ల పట్ల వివక్ష చూపకూడదు’అని పేర్కొన్నారు. ఇక జమాతే నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన చాలా మందిలో కోవిడ్‌ బయటపడింది. అస్సాంలో 20 మందికి వైరస్‌ సోకగా..  అందరూ తబ్లిగీ జమాతేలో పాల్గొన్నవారో.. లేదా నిజాముద్దీన్‌ నుంచి వచ్చినవారో కావడం గమనార్హం.
(చదవండి: లైట్లన్నీ ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది)

మరిన్ని వార్తలు