500 దాటిన కరోనా మరణాలు

20 Apr, 2020 03:27 IST|Sakshi
బిహార్‌ రాజధాని పట్నాలో ఆహార పంపిణీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటిస్తున్న ప్రజలు

ఒక్కరోజులో 1,324 పాజిటివ్‌ కేసులు నమోదు.. 31 మంది మృతి 

16,116కు చేరిన కేసులు.. ఇప్పటిదాకా 519 మంది బలి  

చికిత్సతో కోలుకున్న 2,310 మంది బాధితులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి భయోత్పాతం సృష్టిస్తోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు.. ఒక్కరోజులో ఏకంగా 1,324 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనాతో పోరాడి కన్నుమూశారు. గుజరాత్‌లో 10 మంది, మహారాష్ట్రలో 10 మంది, పంజాబ్‌లో ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో ఒకరు, కర్ణాటకలో ఒకరు మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,116కు, మొత్తం మరణాల సంఖ్య 519కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. యాక్టివ్‌ కరోనా కేసులు 13,295 కాగా, కరోనా బాధితుల్లో 2,310 మంది చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. భారత్‌లో మొత్తం కరోనా బాధితుల్లో 77 మంది విదేశీయులున్నారు.  

అత్యధిక మరణాలు మహారాష్ట్రలోనే..  
మొత్తం 519 కరోనా సంబంధిత మరణాల్లో 211 మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో 70 మంది, గుజరాత్‌లో 58, ఢిల్లీలో 43, ఉత్తరప్రదేశ్‌లో 17, పంజాబ్‌లో 16, తమిళనాడులో 15, కర్ణాటకలో 14, పశ్చిమబెంగాల్‌లో 12, రాజస్తాన్‌లో 11 మంది చనిపోయారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటిదాకా 3,651 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,893, గుజరాత్‌లో 1,604, మధ్యప్రదేశ్‌లో 1,407, తమిళనాడులో 1,372, రాజస్తాన్‌లో 1,351, ఉత్తరప్రదేశ్‌లో 1,084, కేరళలో 400, కర్ణాటకలో 384, జమ్మూకశ్మీర్‌లో 341, పశ్చిమబెంగాల్‌లో 310, హరియాణాలో 233, పంజాబ్‌లో 219 కేసులు బయటపడ్డాయి.  

వ్యవసాయ రంగంలో అనుమతులు
నాన్‌–కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.. హాట్‌స్పాట్లలో మాత్రం కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించుకోవచ్చని సూచించారు. హాట్‌స్పాట్లు, రెడ్‌జోన్లలో కరోనా పాజిటివ్‌ కేసులు 4 కంటే తక్కువ రోజుల్లోనే రెట్టింపు అవుతున్నాయని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఆదివారం 37,173 పరీక్షలు నిర్వహించామని, ఇప్పటిదాకా  3,86,791 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు