కోవిడ్‌ కేసులు 107

16 Mar, 2020 04:31 IST|Sakshi
ఇరాన్‌ నుంచి తిరిగి వచ్చిన భారతీయుల లగేజీపై జైసల్మేర్‌లోని ఆర్మీ ఆస్పత్రి వద్ద మందును స్ప్రే చేస్తున్న సిబ్బంది

కేరళను మించిన మహారాష్ట్ర

ఆందోళన వద్దన్న కేంద్రం

కర్తార్‌పూర్‌ కారిడార్‌లో రాకపోకలపై నిషేధం

న్యూఢిల్లీ: కోవిడ్‌ (కరోనా వైరస్‌) భారత్‌లో స్థానికంగానే వ్యాపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 107కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 12 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కేసుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి అన్ని దేశాల సరిహద్దుల్ని మూసివేసిన కేంద్రం తాజాగా కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా మార్గం వెంబడి కూడా రాకపోకలపై నిషేధం విధించింది. ఆ మార్గం ద్వారా సిక్కు భక్తులు పాక్‌కు వెళ్లడానికి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు.  

కరోనా నేపథ్యంలో ఢిల్లీ–జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బోగీని శుభ్రం చేస్తున్న కార్మికుడు

స్థానికంగా వైరస్‌ వ్యాప్తి
ప్రస్తుతం కరోనా వ్యాప్తి మన దేశంలో స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే దశలోనే ఉంది. దీనిని రెండో దశ అంటారు. ఇక మూడో దశలో జన సమూహాలకు సోకి వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఆ దశ రాకుండానే కేంద్రం, అన్ని రాష్ట్రాలు కరోనాపై యుద్ధం ప్రకటించాయి. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో హెల్ట్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఇంకా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జన సందోహాలు గుమికూడకుండా పర్యవేక్షణ, కోవిడ్‌–19 సోకిందని అనుమానాలున్న వారిని విడిగా ఉంచడం, వైరస్‌ నుంచి వ్యక్తిగత రక్షణ కోసం మాస్క్‌లు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచడం , సుశిక్షితులైన మానవ వనరులు, చురుగ్గా స్పందించే బృందాలను బలోపేతం చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. 80,50,000 ఎన్‌95 మాస్కుల కోసం ఆర్డర్‌ ఇచ్చామని, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కి అందిస్తామని తెలిపారు.  

మహారాష్ట్రలో మరణించిన వ్యక్తికి కరోనా లేదు  
మహారాష్ట్రలో బుల్దానాలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 71 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకలేదని నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఆయన మరణించడానికి ముందు సేకరించిన నమూనాలను పరీక్షించి చూస్తే కరోనా సోకలేదని తేలింది. తొలుత ఆ వృద్ధుడు కరోనాతో మరణించాడన్న అనుమానాలు తలెత్తాయి.  

ఇరాన్, ఇటలీ నుంచి భారతీయులు వెనక్కి  
ఇరాన్‌ నుంచి మూడో విడత 236 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చారు. వారందరినీ జైసల్మీర్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చైనా తర్వాత అత్యధికంగా కరోనా దాడి చేసిన ఇటలీ నుంచి 218 మంది భారతీయుల్ని ఆదివారం వెనక్కి తెచ్చారు. వారిలో 211 మంది విద్యార్థులే ఉన్నారు. వీరిని వాయవ్య ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. దుబాయ్‌ నుంచి కేరళకు వచ్చిన 20 మంది ప్రయాణికుల్లో బ్రిటన్‌కు చెందిన వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో అతడిని కొచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో స్వదేశీ, విదేశీ టూర్లపై కూడా ముంబై సీపీ నిషేధం విధించారు. తాజాగా తమిళనాడు, అస్సాం, ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు, షాపింగ్‌ మాల్స్‌ రెండు వారాల పాటు బంద్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు