పొడిగింపు లేదు.. ఎమర్జెన్సీకి తావు లేదు

31 Mar, 2020 04:02 IST|Sakshi
కేరళలోని కోజికోడ్‌లో మాస్కులు ధరించి తమ నివాసానికి వెళ్తున్న నూతన వధూవరులు

స్పష్టం చేసిన కేంద్రం, ఆర్మీ   1,071కి చేరిన కోవిడ్‌బాధితుల సంఖ్య

 ఇప్పటివరకూ 29 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కాటుకు మరో నలుగురు బలయ్యారు. గత 24 గంటల్లో దాదాపు 92 కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకూ ఈ వ్యాధి బారినపడ్డవారి సంఖ్య 1,071కు, మరణాల సంఖ్య 29కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాధి ఇప్పటివరకూ సామాజిక స్థాయిలో వ్యాప్తి చెందడం లేదని స్పష్టంచేసింది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన  కేంద్రం చేయడం లేదని తెలిపింది. దేశంలో వచ్చే నెలలో అత్యవసర పరిస్థితి విధిస్తారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అసత్యాలని భారతీయ ఆర్మీ ప్రకటించింది. సమాజ సేవ చేస్తున్న పలు సంస్థలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు జరిపారు.  

92 కేసులు.. నాలుగు మరణాలు
దేశం మొత్తమ్మీద గత 24 గంటల్లో దాదాపు 92 కొత్త కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయని, నలుగురు వ్యక్తులు వ్యాధి కారణంగా మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కేసుల సంఖ్య వంద నుంచి వెయ్యికి చేరేందుకు 12 రోజుల సమయం పట్టిందని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది తక్కువ అని ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. సాంకేతికంగా కోవిడ్‌ ప్రస్తుతం స్థానికంగా మాత్రమే వ్యాప్తి చెందుతోందని, సామాజిక స్థాయిలో వ్యాప్తి చెందడం మొదలైతే మరింత సమర్థంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు, జాగరుకత పెంచేందుకు మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియచేస్తామని అన్నారు. కేసుల్లో పెరుగుదల తక్కువగా ఉండేందుకు ప్రజలు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించడం ఒక కారణం కావచ్చునని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా తీసుకున్న అనేక నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం కూడా కావచ్చునని ఆయన వివరించారు.

ఢిల్లీలో మత సమావేశం..
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకుండానే సుమారు 200 మంది మతపరమైన సమావేశం ఒకటి నిర్వహించారని, పలువురికి కోవిడ్‌–19 లక్షణాలు కనిపించడంతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం బయటపడ్డ కేసుల్లో 16 ఉత్తర ప్రదేశ్‌లో గుర్తించగా ఆ రాష్ట్రంలో వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 88కి చేరింది.

లాక్‌డౌన్‌పై..
వైరస్‌ నియంత్రణే లక్ష్యంగా దేశం మొత్తమ్మీద విధించిన లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14వ తేదీ పొడిగించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సోమవారం స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ మరింత కాలం కొనసాగితే ఆర్థికంగా, సామాజికంగా అనేక విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆంచనాలు బలపడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఈ స్పష్టీకరణ రావడం ఆహ్వానించదగ్గది. వలస కూలీలు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ స్వగ్రామాలకు చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చాలాచోట్ల సమస్యలకు, వేదనాభరితమైన ఘటనలకు దారితీస్తూ సామాజిక అలజడికి కారణమవుతున్న విషయం తెలిసిందే. వలస కూలీల విషయంలో ఆయా రాష్ట్రాల్లోనే తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కేంద్రం సూచనలు జారీచేసింది.

కోవిడ్‌ సమస్యలకు ప్రాధాన్యం  
కేంద్ర ప్రభుత్వ విభాగాలన్నీ కోవిడ్‌ సంబంధిత ప్రజా సమస్యలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పనిచేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ సంబంధిత ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన పద్ధతులను విడుదల చేసింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం కేంద్రం ఆదివారం 11 ప్రత్యేక సాధికార బృందాలను ఏర్పాటు చేయగా ఇందులో ప్రజా సమస్యలు, సలహా సూచనలపై ఒక బృందం పనిచేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రతి ప్రభుత్వ విభాగంలో ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని, పేరు, ఫోన్‌ నెంబర్, ఈమెయిల్‌ ఐడీలను ఆయా విభాగం వెబ్‌సైట్‌లో ఉంచాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రతి మంత్రిత్వశాఖ, విభాగం కరోనా వైరస్‌ సంబంధిత ప్రజా సమస్యలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి వాటిని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఇది మూడు రోజుల్లోనే పూర్తయ్యేలా ఉండాలని తెలిపింది.  
 

>
మరిన్ని వార్తలు