ఇరుకు బతుకుల్లో ఊపిరాడేనా?

19 Apr, 2020 02:13 IST|Sakshi

ఆసియాలోని అతిపెద్ద మురికి వాడ ధారావిలో కరోనా కలకలం

ఒక్క గదిలోనే 10 మంది వరకు ఉంటున్న పరిస్థితి 

ఇప్పటికే ధారావిలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి 

మొత్తం 117 మందికి కరోనా.. అందులో ముగ్గురు తెలుగువారు 

ఇక్కడ భౌతిక దూరం పాటించడం కష్టమే 

కరోనాకు అడ్డుకట్ట వేయడం కత్తి మీద సామే 

రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అధికారుల ప్రత్యేక కార్యాచరణ 

సాక్షి, ముంబై: ముంబైలోని ధారావి.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. ఈ ధారావిలో గుడిసెళ్లాంటి ఇళ్లు, దస్‌ బై దస్‌ (పది బై పది అడుగులు) కూడా లేని ఇళ్లల్లో చిన్న పిల్లలతో జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా పశువుల కొట్టం కన్నా చిన్నగా, బాత్రూం కంటే కొంత పెద్దగా ఉండే ఇళలో వలస కూలీలు పది మంది చొప్పున ఉం టారు. దీన్నిబట్టి ఇక్కడ జీవనప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ధారావిలో కరోనా ప్రవేశిస్తే అడ్డుకోవడం కష్టమని అంద రూ భయపడ్డారు. అందరూ భయపడినట్టే ధారావిలో కరోనా వైరస్‌ కలకలం రేకెత్తిస్తోంది. ముంబైలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధారావి మురికివాడలో ఏప్రిల్‌ 1న ప్రవేశించింది. అప్పటి నుంచి రోజురోజుకూ దీని ఉధృతి పెరుగుతోంది. మరణించినవారి సంఖ్య కూడా దాదాపు రెండంకెలకు చేరువలో ఉంది. దీంతో ముంబైకర్లతో పాటు అధికారులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.  

పొంచి ఉన్న ముప్పు.. 
ధారావిలో కరోనా ముప్పు తీవ్రంగా ఉంది. కరోనాను అడ్డుకునేందుకు సామాజిక దూరం పాటించడంతో పాటు గుంపులుగా ఉండొద్దని, నిత్యం చేతులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ చెబుతోంది. అయితే ధారావిలో మాత్రం ఇరుకైన సందులు, చిన్న గుడిసెలు, జనసాంద్రత ఇక్కడ ఇబ్బందికరంగా మారింది. దీంతో కరోనా వైరస్‌ ఇక్కడ వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చేయి దాటక ముందే కరోనా కట్టడి చేయకపోతే ధారావితో పాటు ముంబైలో కరోనాతో జరిగే నష్టాన్ని ఆపడం కష్టసాధ్యం అవుతుంది. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ముంబైలోని  ధారావిపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నాయి. ధారావిలో కరోనా ఇతరులకు సోకకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు చేపట్టారు. రాబోయే రోజుల్లో ధారావిలో కరోనా విస్తరణ ఎలా ఉంటుందనేది చెప్పలేకపోతున్నారు. 

ముస్లింనగర్, ముకుంద్‌నగర్‌లలో అత్యధికం.. 
ధారావిలోని ముస్లింనగర్, ముకుంద్‌నగర్‌లలో కరోనా బాధితులు అత్యధికంగా ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో 39 మందికి కరోనా సోకింది. మరోవైపు గురువారం ఒక్కరోజే 26 మందికి కరోనా సోకగా, శుక్రవారం మరో 15 మందికి, శనివారం 16 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 117కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ 10 మంది మృతి చెందారు. 

ముగ్గురు తెలుగువారికి కరోనా 
ధారావిలోని ముకుంద్‌నగర్‌లో నివసించే ముగ్గురు తెలుగువారికి కరోనా వైరస్‌ సోకిందని తెలిసింది. ఈ విషయాన్ని ధారావి పునరాభివృద్ధి సమితి పదాధికారులు ధ్రువీకరించారు. వీరు అంధించిన వివరాల మేరకు సుమారు 12 లక్షల జనాభా ఉన్న ధారావిలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 25 వేలకుపైగా తెలుగు ప్రజలుంటారు. వీరిలో అనేక మంది కూలీలున్నారు. ముఖ్యంగా ధారావిలోని ముకుంద్‌నగర్, రాజీవ్‌గాంధీ నగర్, అంబేడ్కర్‌ శతాబ్దినగర్, ప్రధానమంత్రి గ్రాండ్‌ ప్రాజెక్టు కాలనీ, సక్రేశ్వర్‌ శివ మందిరం, లేబర్‌ క్యాంప్‌ ఆనంద్‌ సొసైటీ, సాయిబాబానగర్, సుభాష్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నారాయణపేట, యాదగిరి జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే తెలుగు ప్రజలుండే ప్రాంతాల్లో అంతగా కరోనా ప్రభావం లేకపోయినా ముకుంద్‌నగర్‌లో మాత్రం పెద్ద ఎత్తున కరోనా బాధితులున్నారు. వీరిలో ముగ్గురు తెలుగువారున్నారు. 

జనాభా 12,00,000
ధారావి సుమారు 528 ఎకరాల్లో విస్తరించి ఉంది. పశ్చిమ రైల్వే మార్గం, సెంట్రల్‌ రైల్వే మార్గాల మధ్య ఈ ధారావి విస్తరించింది. ఉత్తర భారతీయులతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ధారావిలో సుమారు 10 నుంచి 12 లక్షల జనాభా ఉంది. 100 చదరపు అడుగుల్లోపు ఇళ్లు.. ధారావిలో 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు.. అంటే 100 చదరపు అడుగుల లోపు ఇళ్లే అధికంగా ఉన్నాయి. ఇలాంటి ఇళ్లలో కనీసం నలుగురి నుంచి 10 మందికిపైగా నివసిస్తున్నారు. పైగా వందలాది మంది ఒకే టాయిలెట్‌ వాడాల్సిన పరిస్థితి ఉంది. ధారావిలోని స్థానికులతో పాటు అధికారులను కలిసి వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రయత్నించింది. 

ధారావి కోసం ప్రత్యేక ప్లాన్‌..
ధారావిలో కరోనాను అడ్డుకునేందుకు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ప్రత్యేక ప్లాన్‌ రూపొందించినట్లు బీఎంసీ జీ నార్త్‌ వార్డు ఆఫీసర్‌ కిరణ్‌ దిగావ్కర్‌ తెలిపారు. ఈ ప్లాన్‌ ప్రకారం డాక్టర్లు, నర్సులు, మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన వారితో 10 బృందాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు చెందిన 24 మంది డాక్టర్లు ఉంటారు. వీరితోపాటు 35 మంది బీఎంసీ సిబ్బంది, 10 మంది పోలీసులున్నారు. వీరంతా ధారావిలో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ధారావిలో బీఎంసీ నిర్మించిన కామన్‌ టాయిలెట్లు అధికంగా ఉన్నాయి. వీటిని శుభ్రం చేయడానికి న్యూజిలాండ్‌ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తున్నాం.     
– కిరణ్‌ దిగావ్కర్‌ (బీఎంసీ అధికారి) 

పైసల్లేవ్‌.. పని లేదు..  
కరోనా కారణంగా ట్యాక్సీ సేవలు నిలిచిపోవడంతో ఇం టికే పరిమితమయ్యాం. ప్రస్తు తం పని లేదు..పైసలూ లేవు. భార్య, ఇద్దరు పిల్లలతో చిన్న ఇంట్లో రోజంతా ఉం డాలంటే తీవ్ర ఇబ్బంది అవు తోంది.    
– శనిగారం తిరుపతి, ట్యాక్సీ డ్రైవర్‌

రెండ్రోజులు చేయాలి..   
కరోనా అడ్డుకునేందుకు ధారావిని  దిగ్బంధం చేశారు. నిత్యావసరాల కొనుగోలు కోసం ఉదయం 7–10 వరకు సడలింపు ఇస్తు న్నారు. అయితే ఇలా కాకుండా వారానికి 2 రోజులే సడలిస్తే కరో నాను అడ్డుకోవడం సులభం అవుతుంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాం తాల్లో ఆంక్షలను కఠినం చేయాలి. 
– దామరగిద్ద బాలరాజ్‌ (సామాజిక కార్యకర్త) 

దిగ్బంధంలో ధారావి... 
కరోనా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ధారావిని దిగ్బంధం చేశారు. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అసలే చిన్న చిన్న గదులు.. ఇరుకైన సందులు.. గాలి కూడా సరిగా ఆడని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిసరాల్లో అందరూ ఇళ్లలో ఉండడం కష్టతరం గా మారింది. ముఖ్యంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనులకు వెళ్లి రాత్రి పడుకునేందుకే గదులకు వచ్చేవారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉం డాల్సి వస్తోంది. వీరిని ఇళ్లలో ఎలా నిర్బంధించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ధారావిలో అత్యంత జనసాంద్రత కారణంగా కరోనా చాలా వేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు