కరోనా లేకుంటేనే అనుమతి..

25 May, 2020 03:20 IST|Sakshi

రైలు, విమాన, అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై వేర్వేరు ఉత్తర్వులు

ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పనిసరి

అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్‌లో సడలింపులు

14 రోజుల నుంచి ఏడు రోజులకు కుదింపు  

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా లక్షణాలు లేనివారినే విమాన, రైలు, అంతర్రాష్ట్ర బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఆయా రాష్ట్రాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో బయలుదేరడానికి ముందే వారిని థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా పరీక్షించాలని, ఎలాంటి కరోనా లక్షణాలు లేనివారికే ప్రయాణానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రయాణికులంతా తమ మొబైల్‌ పరికరాల్లో ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌  చేసుకోవాలని సూచించింది. అలాగే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో అనుసరించాల్సిన ముందుజాగ్రత్త చర్యలతో కరోనాకు సంబంధించిన తగిన ప్రకటన చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 

అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్‌లో సడలింపులు...
అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్‌లో సడలింపులిస్తూ కేంద్రం మరో ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించి విమానం ఎక్కడానికి ముందు ప్రయాణికులందరూ 14 రోజులు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండటానికి ఒప్పుకోవాలి. అయితే అందులో ఏడు రోజులు తమ సొంత ఖర్చుతో హోటళ్లు, లాడ్జీల్లో ఉండాలి. మిగిలిన ఏడు రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండాలి. గర్భిణులు, మానసిక సమస్యల్లో ఉన్నవారు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించడం, తీవ్రమైన అనారోగ్యం, పదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ఉన్న తల్లిదండ్రుల వంటి అసాధారణ కారణాలున్న వారికి పూర్తిగా సడలింపులిచ్చారు. వారు 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండటానికి అనుమతించారు. అటువంటి సందర్భాల్లో ఆరోగ్యసేతు యాప్‌ను ఉపయోగించాలి.

అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇలా...
♦ విమానం లేదా ఓడ ఎక్కడానికి ముందు ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు.

♦ కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. అటువంటి వారినే దేశంలోకి అడుగుపెట్టడానికి అనుమతిస్తారు.

ప్రయాణికులు ఇచ్చే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని ఆరోగ్యసేతుకు అనుసంధానం చేస్తారు. ఈ కాపీని విమానాశ్రయం, ఓడరేవు, ల్యాండ్‌పోర్ట్‌ వద్ద ఉన్న వైద్య ఆరోగ్య, ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు కూడా ఇస్తారు.

బోర్డింగ్‌ సమయంలో, విమానాశ్రయాల్లో భౌతికదూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి.

కరోనాకు సంబంధించిన ప్రకటనలను విమానాశ్రయం లేదా ఓడరేవుల్లో చేయాలి.

♦ విమానంలో, ఓడలో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించాలి.

పర్యావరణ, శ్వాసకోశ పరిశుభ్రత పాటించాలి. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి.

దిగిన తర్వాత ప్రయాణికులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. ఆ సమయంలో కరోనా అనుమానిత లక్షణాలుంటే, వారిని ఆస్పత్రికి తరలించాలి. మిగిలిన ప్రయాణికులను సంబంధిత రాష్ట్రాలు తగిన క్వారంటైన్‌ ప్రాంతాలకు తీసుకెళ్లాలి.

ఈ ప్రయాణికులను కనీసం ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి. తేలికపాటి అనుమానిత కేసులైతే హోం ఐసొలేషన్‌ లేదా ప్రభుత్వ, ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచాలి.

♦ ఒక మోస్తరు లేదా తీవ్రమైన కరోనా లక్షణాలను కలిగి ఉన్నవారిని కరోనా ఆస్పత్రికి తరలించాలి.

నెగెటివ్‌ వచ్చిన వారిని ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. తర్వాత ఏవైనా లక్షణాలు కనిపిస్తే వారు జిల్లా నిఘా అధికారికి లేదా రాష్ట్ర లేదా జాతీయ కాల్‌ సెంటర్‌కు తెలియజేయాలి. 

దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు..

ప్రయాణ సమయంలో అందరూ మాస్క్‌లు ధరించడంతోపాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

 శ్వాసకోశ సంబం ధిత, పర్యావరణ పరిశుభ్రతను పాటించాలి.

► విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. ఆయాచోట్ల ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి.

సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.

► ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకొని బయటకు వెళ్లేచోట అధికారులు థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయాలి.

కరోనా లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజులు వారి ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలన్న సలహాతో పంపాలి.

ఒకవేళ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే అధికారులు జిల్లా నిఘా అధికారికి లేదా జాతీయ కాల్‌ సెంటర్‌ 1075కు ఫోన్లో సమాచారం అందించాలి.

ఒక మోస్తరు, తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారిని సమీప ఆస్పత్రికి తరలించాలి. ఆయా ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిని కోవిడ్‌ ఆస్పత్రులకు తరలించాలి.

తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నవారిని హోం ఐసోలేషన్‌ లేదా ప్రభుత్వ, ప్రైవేటుల్లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనిఐసోలేషన్‌లో ఉండేందుకు అనుమతించాలి.

క్లినికల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం వారికి తగిన వైద్యం అందించాలి.

 కరోనా నెగెటివ్‌ ఉంటే ప్రయాణికులు 7రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్లేం దుకు అనుమతించాలి.

ఈ విషయంలో రాష్ట్రాలు వారి అంచనా ప్రకారం క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌కు సంబంధించి తమ సొంత ప్రొటోకాల్స్‌ను తయారు చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు