‘కరోనా’ హెల్మెట్‌తో పోలీసుల వినూత్న ప్రచారం

28 Mar, 2020 17:40 IST|Sakshi

సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 14 వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు పదే పదే వేడుకుంటున్నా కొంతమంది మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసులు ముందు పద్దతిగా చెప్పి చూస్తున్నారు.. కొన్నిచోట్ల మాత్రం తమ లాఠీలకు పనిచెబుతున్నారు. అయినప్పటికీ కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇలాంటి వారికి కరోనావైరస్‌పై అవగాహన కల్పించేందుకు తమిళనాడు పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. నిబంధనలు అతిక్రమించి.. అకారణంగా ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చిన వారిని ఆపి, కరోనా ప్రభావం ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాములుగా చెప్తే వినడంలేదని.. వినూత్నంగా కరోనా వైరస్‌ రూపంలో డిజైన్‌ చేసిన హెల్మెట్‌ పెట్టుకొని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించాలని, దయచేసి ఎవరూ అకారణంగా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోందని పోలీసు అధికారులు చెబుతున్నారు . 

‘ప్రజలు బయటకు రాకుండా అన్ని ప్రయత్నాలు చేశాం. అయినప్పటికి కొంతమంది అకారణంగా బయటకు వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. దీనికోసం అచ్చం కరోనా వైరస్‌ను పోలిన హెల్మెట్ తయారు చేయించాం. ఇలాగైనా ప్రజల్లో కరోనాపై భయం పెంచి, వారిని ఇళ్లకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ హెల్మెట్‌ కొంచెం డిఫరెంట్‌గా ఉండడంతో ప్రతి ఒక్కరికి ఈ మహమ్మారి ప్రభావం గురించి ఆలోచించగల్గుతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కరోనావైరస్‌పై అవగాహన కలిగి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారు’అని హెల్మెట్‌ ధరించిన ఓ పోలీసులు అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు