భారత్‌లో 148కి చేరిన కరోనా కేసులు

18 Mar, 2020 10:04 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. లక్షా 97 వేల మంది ఈ వైరస్‌ బారిన పడగా 7900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, ఇరాన్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్క ఇటలీలోనే 31వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా రెండున్నర వేల మంది మరణించారు. కాగా భారత్‌లో మంగళవారం మూడో కరోనా మరణం నమోదైంది. ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్‌తో మరణించగా మరోవైపు అతని భార్యకు కరోనా సోకింది. దీంతో ఆమెకు కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. (తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు)

ఇప్పటికే కర్ణాటకలోని కల్బుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ కోవిడ్‌తో మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు పుణెలో ఓ మహిళకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల సంఖ్య 148కి చేరింది. ఇందులో 131 మందికి పాజిటివ్‌ అని తేలగా ముగ్గురు మరణించారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 42 కేసులు నమోదయ్యాయి. కాగా చైనాలో మంగళవారం కరోనా వ్యాధిగ్రస్తులు 11 మంది మరణించడంతో అక్కడి మృతుల సంఖ్య 3237కు చేరుకుంది. (కరోనా: వివాదం రేపిన ట్రంప్‌ ట్వీట్‌)

చదవండి: మానవ స్పర్శకు కరోనాతో గండి

>
మరిన్ని వార్తలు