కరోనా: ఇంటికి వెళ్ల‌నంటున్న వైద్యుడు

9 Apr, 2020 16:31 IST|Sakshi

భోపాల్‌ : మ‌నం ఇంట్లో.. వైద్యులు ఆస్ప‌త్రిలో. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ప‌రిస్థితి ఇదీ. క‌రోనాకు వ్య‌తిరేకంగా పోరాడుతున్న డాక్ట‌ర్లు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. రోజుల త‌ర‌బ‌డి ఆసుప‌త్రిలోనే గ‌డిపేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ వైద్యుడు అస‌లు ఇంటికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం అంటున్నాడు. పొరపాటున కూడా త‌న‌వ‌ల్ల త‌న కుటుంబానికి క‌రోనా వైరస్ సోక‌కూడ‌ద‌ని కారునే ఇల్లుగా మార్చుకున్నాడు. ఈ అరుదైన ఘ‌ట‌న‌ మ‌ధ్య‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్‌కు చెందిన స‌చిన్ నాయ‌క్ స్థానిక జేపీ ఆసుప‌త్రిలో వైద్యుడిగా సేవ‌లందిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డ వ్య‌క్తుల‌కు వైద్యం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌ను ఇంటికి వెళ్ల‌డానికి త‌ట‌ప‌టాయించాడు. త‌న వ‌ల్ల ఎవ‌రికీ క‌రోనా సోక‌కూడ‌ద‌ని త‌న కారులోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. (దాచుకున్న డబ్బులు దానం)

దీని గురించి నాయ‌క్ మాట్లాడుతూ.. "నా కుటుంబానికి వైర‌స్ సంక్ర‌మించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ఇంటికి వెళ్ల‌డం లేదు. గ‌త ఏడు రోజులుగా కారులోనే ఉంటూ, అందులోనే నిద్ర‌పోతున్నాను. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్ర‌త్త‌ల వ‌ల్ల ప‌రిస్థితి కాస్త మెరుగుప‌డింద‌"ని పేర్కొన్నాడు. ఈ డాక్ట‌రు గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స‌దరు వైద్యుడిని అభినందించారు. మ‌రోవైపు అధికారులు అత‌నితోపాటు ఇత‌ర వైద్యుల‌కు కూడా వ‌స‌తి సౌక‌ర్యాన్ని క‌ల్పించే ప‌నిలో ప‌డ్డారు. (కారాగారం నుంచే కరోనాపై పోరు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు