భారత్‌లో కరోనా కేసులు తక్కువే?

13 May, 2020 16:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీ, అమెరికా, బ్రిటన్‌ దేశాల్లోలాగా అతివేగంగా కరోనా వైరస్‌ భారత్‌ దేశంలో విస్తరించడం లేదు. అందుకు కొంత మనం ఆనందించాల్సిందే. అయితే మనకన్నా ఎక్కువగా ఆ దేశాల్లో కరోనా విజృంభించడానికి కారణాలను విశ్లేషించాల్సిందే. రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం లాంటి సరైన పౌర సదుపాయాలు లేకపోవడం, దారిద్య్రంలో బతకడం వల్ల అంటురోగాలు ఎక్కువగా వస్తాయని అంటారు. అందుకు విరుద్ధంగా సంపన్న దేశాల్లో కరోనా విజృంభించడానికి బలమైన ఇతర కారణాలు ఉండాలి. (చదవండి : ఒక్కరోజులో 3,525 కేసులు)

కరోనా కారణంగా వృద్ధులు ఎక్కువగా మరణిస్తున్నారన్న విషయం ఇప్పటికే రూఢీ అయింది. ఇటలీలో వృద్ధులు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మరి అమెరికాలో ఎందుకు ఎక్కువగా కరోనా బారిన పడి మరణిస్తున్నారు? అమెరికాలో కరోనా కేసులు ఎక్కువగా న్యూయార్క్‌ సిటీలో ఎక్కువగా ఉన్నాయి. 

న్యూయార్క్‌ సిటీలో కూడా మన్‌హట్టన్‌లో కన్నా బ్రాంక్స్, క్వీన్స్, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. మన్‌హట్టన్‌లో శ్వేతజాతీయులు ఎక్కువగా ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో నల్ల జాతీయులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ తెల్ల జాతీయులకన్నా నల్ల జాతీయులు ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. తెల్లజాతీయులు ఆర్థికంగా మెరుగ్గా ఉండడం, వారు పెద్ద పెద్ద ఇళ్లలో దూరంగా ఉండడం వల్ల వారు ఎక్కువగా కరోన బారిన పడడం లేదు. నల్లజాతీయులు ఆర్థికంగా వెనకబడి పోయి ఉండడం వల్ల వారి దగ్గరిదగ్గర కిక్కిర్సిపోయి ఉంటున్నారు. అందుకనే వారి మధ్య వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. బ్రాంక్స్‌లో ఏకంగా 43 శాతం మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు ఉన్నారు. 

భారత్‌లోని ముంబై నగరంలో కరోన విజృంభించడానికి కూడా ఇదే కారణం. ముంబైలోని ధారావి ప్రాంతంలో కరోన కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ కిక్కిర్సిన రేకుల గదుల్లో పేదవారు నివసిస్తుండడమే ప్రధాన కారణం. భారత్‌లో ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల్లో, పేద వర్గాల్లో కరోనా ఎక్కువగా విస్తరిస్తోంది. సంపన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో కేసులు తక్కువగా ఉన్నాయంటే కొన్ని కఠిన చర్యలు సత్ఫలితాలివ్వడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ బాగుండడం కూడా. ఇప్పుడు వలస కార్మికుల రాకపోకలను అనుమతించడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంగ్లండ్‌లో కూడా వెనకబడిన ప్రాంతాల్లోనే కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. నగరాల్లో సన్‌బాత్‌ పేరిట రోడ్లపైకి రావడం, ఆంక్షలను ఉల్లంఘించి బీచ్‌ల వద్ద గుంపులుగా ఉండడం వల్ల కూడా ఆ ప్రాంతాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. 

మరిన్ని వార్తలు